Share News

లడ్డూపై చర్చ..రచ్చ

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:19 AM

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై లఘు చర్చ సందర్భంగా బుధవారం శాసనమండలిలో పెద్ద రగడ జరిగింది. చైర్మన్‌, మంత్రుల మధ్య సంవాదం చోటుచేసుకుంది.

లడ్డూపై చర్చ..రచ్చ

  • ‘కల్తీ’ అంశం వదిలి వేరే విషయాలు వైసీపీ ప్రస్తావించడంపై టీడీపీ ఫైర్‌

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై లఘు చర్చ సందర్భంగా బుధవారం శాసనమండలిలో పెద్ద రగడ జరిగింది. చైర్మన్‌, మంత్రుల మధ్య సంవాదం చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో కల్తీ నెయ్యి అంశంపై జరగాల్సిన చర్చ...రచ్చగా ముగిసింది. సభ్యుల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శలతో పెద్దలసభ దద్దరిల్లింది. వైసీపీ సభ్యులు పదేపదే చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లారు. చర్చలో వైసీపీ సభ్యులు పదేపదే హెరిటేజ్‌ డెయిరీ ప్రస్తావన తీసుకురావడాన్ని అధికార పక్షం అభ్యంతరపెట్టింది. చైర్మన్‌ మోషేన్‌రాజు, మాజీ సీఎం జగన్‌లు క్రిస్టియన్లు.. అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. మండలినిర్వహణ, లఘుచర్చపై చట్టం ఏం చెబుతుందనే అంశంపై మంత్రి మనోహర్‌ (ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్‌) చెప్పిన రూల్‌కు చైర్మన్‌ అభ్యంతరం తెలిపారు. రెండు విడతలుగా ఒకే అంశంపై తీవ్ర వాదోపవాదాలు, కేకలు, అరుపులు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఖండనలు... క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లతో చర్చ ఆసాంతం గందరగోళంగా సాగింది.


మంత్రులు వర్సెస్‌ చైర్మన్‌

మధ్యాహ్నం 12.30 సమయంలో తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై లఘు చర్చకు చైర్మన్‌ మోషేన్‌రాజు అనుమతించారు. గంట సమయం ఇస్తున్నామని, ఇందులో వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రులకు 10 నిమిషాలు కేటాయించినట్టు చైర్మన్‌ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. లఘు చర్చ ప్రారంభించే ముందు తానురెండు అంశాలపై ప్రకటన చేస్తానని మంత్రి రామనారాయణరెడ్డి అన్నారు. చర్చ తర్వాత ప్రకటన చేయాలని ఆయనకు చైర్మన్‌ సూచించారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీపై చర్చించడానికి బీఏసీలో అంగీకారం తీసుకున్నాం. ఈ అంశంపై ఏ సభ్యుడు కూడా నోటీస్‌ ఇవ్వలేదు. కానీ ప్రభుత్వమే ముందుకొచ్చి లఘు చర్చ పెట్టండని చెప్పింది. మీ సమక్షంలో నిర్ణయం తీసుకున్నాం. సభ్యులు మాట్లాడాకే ప్రభుత్వం స్పందిస్తుంది. అయితే కొన్ని వాస్తవాలు చెప్పదలుచుకున్నాం. సంప్రదాయాలకు విరుద్ధంగా ముందు చర్చకు అనుమతించి, తర్వాత ప్రకటనకు మీరు అనుమతించారు. దీనివల్ల ప్రభుత్వ ప్రకటనకు అంత విలువ ఉండదు. ఇలాంటి చారిత్రాత్మక తప్పిదానికి ఈ సభ వేదిక కాకూడదని కోరుతున్నాను’’ అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ‘‘సభ ప్రొసీడింగ్స్‌ గురించి మంత్రి చెప్పేటప్పుడు చెప్పనీయండి. విన్న తర్వాత ఏదైనా మాట్లాడండి. తర్వాత నేను స్పందిస్తా.. నాకున్న అవగాహన మేరకు నేను సమాధానం ఇస్తా’’ అని చైర్మన్‌ అన్నారు. మంత్రి మనోహర్‌ జోక్యం చేసుకోగా, కూర్చోండని చైర్మన్‌ వారించారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ చెప్తానంటూ మనోహర్‌ మాట్లాడుతూ, రూల్‌ 65 ప్రకారం, లఘు చర్చకు అనుమతించే ముందు ప్రకటన చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలన్నారు. అయితే, అది ఈ సందర్భానికి వర్తించబోదని, అది వాయిదా తీర్మానాలకు సంబంధించిందని చైర్మన్‌ స్పందించారు. లఘు చర్చలో ప్రభుత్వ ప్రకటన లేదని ఆయన అనడంతో.. అధికార పార్టీ సభ్యులు కేకలు పెట్టారు. పలువురు మంత్రులు రూల్‌ విషయంలో చైర్మన్‌ను పదేపదే అభ్యర్థించారు. వైసీపీ సభ్యులు కేకలు వేస్తుండగా, నోటీస్‌ కూడా ఇవ్వకుండా మాట్లాడతారా అంటూ వైసీపీ సభ్యులపై మంత్రి కేశవ్‌ మండిపడ్డారు. ఈ సమయంలో చర్చను చైర్మన్‌ ప్రారంభించారు. చర్చలో మొదట పిలిచిన సభ్యుడు (చంద్రశేఖర్‌రెడ్డి) ఇండిపెండెంట్‌ అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.


హెరిటేజ్‌.. ఇందాపూర్‌.. వైసీపీ కేకలు..

తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడగా, మంత్రి అచ్చెన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పడం కాదు.. ఎన్డీడీబీ రిపోర్టులో ఉన్నదే ఆయన చదివారని తెలిపారు. రూ.321 కిలోనెయ్యిని రూ.658కు పెంచి ఇందాపూర్‌కు టెండర్‌ కట్టబెట్టి, ఆర్థిక కుంభకోణానికి ప్రయత్నించారని చంద్రశేఖరరెడ్డి అనగా, టెండర్‌ ఈ ప్రభుత్వంలో వచ్చినా.. బోర్డు ఎవరిదని మంత్రి కేశవ్‌ ప్రశ్నించారు. ‘‘మేం టీటీడీలో పెట్టిన నాలుగు నిబంధనలను వీళ్లు (వైసీపీ) సడలించారు. దానివల్లే నెయ్యి కల్తీ జరిగింది.’’ అని మంత్రి వివరించారు. సభ్యుడు హెరిటేజ్‌ ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రభుత్వ విప్‌ అనురాధ తప్పుబట్టారు. హెరిటేజ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘క్రిస్టియన్‌’ వ్యాఖ్యలు.. అచ్చెన్న క్షమాపణలు

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సమయంలో ‘తమరు క్రిస్టియన్‌, జగన్మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్‌ మోషేన్‌రాజు అభ్యంతరం తెలిపారు. ‘‘నేను క్రిస్టియన్‌ను కాదు. హిందువును. మీ వ్యాఖ్యలతో నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు. నా కులంపై మాట్లాడటం సరికాదు. చైర్‌ను కించపర్చే మాటలు వెనక్కి తీసుకోవాలి. నేను భేషజాలకు పోను’’ అని అన్నారు. దీంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకున్నారు. ‘‘తమరు క్రిస్టియన్‌ అనుకుని అన్నాను. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా’’ అన్నారు. మంత్రి వివరణకు తాను సంతృప్తి చెందినట్టు చైర్మన్‌ అన్నారు. అనంతరం మంత్రి అచ్చెన్న కొనసాగిస్తూ.. జగన్‌ క్రిస్టియన్‌ అనేందుకు మాత్రం ఆధారాలున్నాయని, ఆ విషయంలో నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. హిందువులను బాధ పెడుతున్న జగన్‌ తరఫున వైసీపీ సభ్యులే సభకు క్షమాపణ చెప్పాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. మంత్రి క్షమాపణలతో చైర్మన్‌ సంతృప్తి చెందినప్పటికీ.. వైసీపీ సభ్యులు మాత్రం చైర్మన్‌ పోడియం వద్దకు చేరుకుని పెద్ద పెద్దగా నినాదాలు చేశారు. దీంతో చైర్మన్‌ సభను వాయిదావేశారు. ఆ తర్వాత కూడా వైసీపీ సభ్యులు నినాదాలతో అంతరాయం కల్గించడంపై మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. లడ్డూ కల్తీపై ఎన్ని రోజులైనా సభలో చర్చకు సిద్ధమని అచ్చెన్న సవాల్‌ చేశారు. బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు జోక్యం చేసుకుంటూ, జగన్‌ హిందువు కాదన్నారు. వైసీపీ సభ్యుడు మాధవ్‌కు అవకాశం ఇవ్వగా, మధ్యలో అడ్డం తగిలితే కుదరదని మాధవ్‌ అన్నారు. దీనిపై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌ను ఆదేశించడం మంచిది కాదని మందలించారు. సాక్ష్యాధారాలు, కొత్త విషయాలు ఏవైనా ఉంటే సభ దృష్టికి తేవాలని మంత్రి కేశవ్‌ కోరగా... అలీబాబా, భోలేబాబా అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. చివరికి చర్చ పూర్తి కాకుండానే మండలిని చైర్మన్‌ గురువారానికి వాయిదా వేశారు. కాగా, అసెంబ్లీ గేటు బయట కూడా అచ్చెన్న క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 05 , 2026 | 04:19 AM