Share News

అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్రమత్తుకు నలుగురి ప్రాణాలు బలి

ABN , Publish Date - May 05 , 2026 | 05:55 AM

అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఉబ్బసం రోగిని ఎలాగైనా బతికించుకోవాలని అంబులెన్స్‌లో పశ్చిమబెంగాల్‌ నుంచి...

అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్రమత్తుకు నలుగురి ప్రాణాలు బలి

  • ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ

  • తిరుపతి జిల్లా ఊరందూరులో ప్రమాదం

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • అందరూ పశ్చిమబెంగాల్‌ వాసులు

  • చికిత్స కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన

  • మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం

శ్రీకాళహస్తి, మే 4(ఆంధ్రజ్యోతి): అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఉబ్బసం రోగిని ఎలాగైనా బతికించుకోవాలని అంబులెన్స్‌లో పశ్చిమబెంగాల్‌ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరిందా కుటుంబం. అయితే, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అంబులెన్స్‌ ఢీకొనడంతో రోగి సహా ముగ్గురు కుటుంబసభ్యులు, అంబులెన్స్‌ కో-డ్రైవర్‌ కూడా మృతి చెందారు. డ్రైవర్‌ సహా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పోలీసుల కథనం మేరకు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం హుగ్లీ ప్రాంతానికి చెందిన బ్రజా డోలుయి(48) తీవ్ర ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. స్థానిక వైద్యుల సలహా మేరకు ఆయనను బెంగళూరులోని ప్రముఖ ఆస్తమా వైద్యశాలకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. బ్రజా డోలుయితోపాటు భార్య టగారి(35), అన్న జతిన్‌(63), టగారి స్నేహితురాలు థగోడిస్‌ శనివారం రాత్రి 10.30 గంటలకు హుగ్లీ నుంచి అంబులెన్స్‌లో బెంగళూరుకు బయలుదేరారు. డ్రైవర్‌ రాకేశ్‌ పండిత్‌(29) అంబులెన్స్‌ను నడుపుతుండగా, అతని సోదరుడైన కో-డ్రైవర్‌ రితేశ్‌ పండిత్‌(24) కూడా ఇదే వాహనంలో ఉన్నారు. డ్రైవర్‌ రాకేశ్‌ నిద్రమత్తులో ఊరందూరు వద్ద రేణిగుంట-నాయుడుపేట జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బ్రజా డోలుయి, టగారి, జతిన్‌, రితేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌, థగోడి్‌సలను పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 05:56 AM