శ్రీవారి ధర్మ రథాలకూ ఘన చరిత్ర!
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:12 AM
శ్రీవారి ధర్మ రథం... దీనినే భక్తులు సులువుగా ‘ఉచిత బస్సు’ అని పిలుచుకుంటారు! తిరుమల బస్టాండ్, సీఆర్‌వో, జేఈవో ఆఫీసు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సర్వదర్శనం క్యూ, ఎస్వీ మ్యూజియం...
1944 తర్వాత రెండు బస్సులతో టీటీడీ ట్రాన్స్‌పోర్టు
వంద బస్సులకుపైగా పెరిగాక ఆర్టీసీలో విలీనం
1982లో కొండపై భక్తుల కోసం ‘ఉచిత బస్సు’
ఇప్పుడు భక్తుల సేవలో 31 ధర్మ రథాలు
దసరా బ్రహ్మోత్సవాల నాటికి మరో 15 సిద్ధం
ఫోన్‌లోనే రూట్‌మ్యాప్, మెట్రో తరహా అలెర్ట్స్
బస్సు ఎక్కడుందో తెలుసుకునేలా అధికారులకు యాప్
(తిరుమల - ఆంధ్రజ్యోతి): శ్రీవారి ధర్మ రథం... దీనినే భక్తులు సులువుగా ‘ఉచిత బస్సు’ అని పిలుచుకుంటారు! తిరుమల బస్టాండ్, సీఆర్‌వో, జేఈవో ఆఫీసు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సర్వదర్శనం క్యూ, ఎస్వీ మ్యూజియం... ఇలా ఎక్కడైనా దిగొచ్చు. ఎక్కడైనా ఎక్కొచ్చు! ఈ శ్రీవారి ధర్మ రథాలకూ ఒక గొప్ప చరిత్ర ఉందండోయ్! తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డులాగానే ఇందులోనూ అనేక కీలక మలుపులున్నాయ్!
ఇలా మొదలైంది!
1944 ఏప్రిల్ 10వ తేదీ... ఇది తిరుమల ‘రవాణా’ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైన రోజు. అప్పటిదాకా తిరుపతి నుంచి తిరుమలకు చేరాలంటే మెట్ల దారి ఒక్కటే మార్గం! ఆ రోజున టీటీడీ అధికారికంగా మొదటి ఘాట్‌రోడ్డును ప్రారంభించింది. ఆ క్రమంలోనే ‘టీటీడీ ట్రాన్స్‌పోర్ట్’ ఏర్పాటైంది. రెండంటే రెండే బస్సులతో ఈ రవాణా వ్యవస్థ మొదలైంది. భక్తుల ఆదరణ బాగుండటంతో అదే ఏడాదిలో బస్సుల సంఖ్య 15కు పెరిగింది. 1950లలో రోజుకు సుమారు 2వేల మంది భక్తులు టీటీడీ బస్సుల్లో ప్రయాణించేవారు. తర్వాతి దశకంలో ఆ సంఖ్య ఐదు వేలకు పెరిగింది.
రెండో ఘాట్ రోడ్డు రాకతో...
తిరుపతి-తిరుమల మధ్య 1973లో రెండో ఘాట్‌రోడ్డు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే టీటీడీ రవాణా విభాగంలో బస్సుల సంఖ్య వంద దాటింది. అయితే... రానురాను ఈ బస్సుల నిర్వహణ కష్టతరంగా మారింది. ఈలోపు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీస్ఎఆర్టీసీ) బలోపేతమైంది. దీంతో... టీటీడీ ప్రజారవాణా విభాగాన్ని 1975లో ఆగస్టు 10వ తేదీన ఆర్టీసీలో విలీనం చేశారు.
మరి... కొండపై భక్తులకెలా?
బస్సులను ఆర్టీసీలో విలీనం చేసిన తర్వాత టీటీడీకి బస్సుల్లేకుండా పోయాయి. మరోవైపు... కొండకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో భక్తుల సౌకర్యార్థం తిరుమలలోనే పలు ప్రాంతాలకు భక్తులను ఉచితంగా చేర్చేలా ‘టీటీడీ ధర్మరథం’ పేరిట 1982లో ఆరు బస్సులను ఏర్పాటు చేసింది. ఇలా మళ్లీ టీటీడీకి సొంత బస్సులు సమకూరాయి. క్రమంగా ఆ సంఖ్య 15కు చేరింది.
మరింత ఆధునికం..
తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని తగ్గించేలా టీటీడీ డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే దశల వారీగా 14 విద్యుత్ బస్సులు చేరాయి. అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో రిలయన్స్ సంస్థ 25, భారత్ బయోటెక్ సంస్థ మరో 7 బస్సులను విరాళంగా అందించాయి. వీటిని బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ నెల 16న ప్రారంభించారు. ఈ బస్సులకు ‘శ్రీవారి ధర్మరథం’ అనే పేరు పెట్టారు. ఈక్రమంలో 14పాత బస్సులతో పాటు 32 కొత్త పాత బస్సులు జత కావడంతో శ్రీవారి ధర్మ రథాల సంఖ్య 42కు చేరుకుంది. మరో 15 బస్సులు రిజిస్ర్టేషన్ ప్రక్రియలో ఉన్నాయి. వెరసి... వచ్చే వచ్చే నెలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయానికి 42 బస్సులు సిద్ధమవుతాయి. కొండపై భక్తులకు ప్రతి రెండు నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది. వెరసి ఒకప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో నడిచిన ప్రజా రవాణా ఆర్టీసీలో విలీనమైనా... ఇప్పుడు శ్రీవారి ధర్మ రథాల రూపంలో మరో వ్యవస్థ వచ్చి చేరింది.
సాంకేతికతతో సౌలభ్యం
తిరుమల మొత్తం పరిధి 6.5 కిలోమీటర్లు. ఈ క్రమంలో రింగురోడ్డును కూడా కలుపుకుని 21 బస్టాప్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి బస్టాప్‌లో క్యూఆర్ కోడ్‌లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌ను సెల్‌ఫోన్‌లో స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ కన్పిస్తుంది. దిగాల్సిన ప్రదేశాన్ని టచ్ చేస్తే... ఆ స్టాప్ వచ్చే ముందుగానే ఫోన్‌లోనే అలర్ట్ వస్తుంది.
మెట్రో ట్రైన్ తరహాలో రాబోయే స్టాప్ వివరాలు ఆటోమెటిక్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేలా ఏర్పాట్లు
‘రియల్ టైం మానిటరింగ్’ నిమిత్తం అధికారుల కోసం టీటీడీ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. బస్సు ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఆగిపోతే... ఆ బస్ సింబల్‌పై టచ్ చేసి డ్రైవర్ వివరాలు, ఫోన్ నంబరు డిస్‌ప్లే అవుతాయి. ఫోన్ చేసి సమస్య ఏమిటో తెలుసుకోవచ్చు.బస్సును అతివేగంగా, నిర్లక్ష్యంగా (ర్యాష్ డ్రైవింగ్) నడిపినా అధికారులు ఇట్టే గుర్తుపట్టి డ్రైవర్‌ను హెచ్చరిస్తారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం