నెయ్యి అబద్ధం.. కొవ్వు నిజం!
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:51 AM
డెయిరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా... ఆ నివేదికలోని అంశాలను ‘సిట్’ తన చార్జిషీటులో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా...
వైసీపీ హయాంలో ఘోర అపచారం.. వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం
జంతువుల కొవ్వు లేదని ‘సిట్’ నిర్ధారించినట్లు అబద్ధాలు
‘ఫ్యాట్’ను నిర్ధారించిన ఎన్‌డీడీబీ
ఆ రంగంలో అత్యున్నత సంస్థ అదే!
చార్జిషీటులోనూ ప్రస్తావించిన ‘సిట్’
అశక్తతతో ఐసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్
దానిని పట్టుకుని వైసీపీ నానా యాగీ
అనిల్ సింఘాల్ తప్పు చేశారు..!
తప్పుడు నిర్ణయాలకు తలూపారు
ధర్మారెడ్డి, బాలాజీలదీ అదే బాట: సిట్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని, నూటికి నూరు పాళ్లూ రసాయన మిశ్రమమని స్పష్టంగా తేలిపోయింది!
అయినా సరే, అందులో జంతువుల కొవ్వు లేదని తనకుతానుగా ‘సర్టిఫికెట్’ ఇచ్చుకున్న వైసీపీ... ‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’ అంటోంది!
డెయిరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా... ఆ నివేదికలోని అంశాలను ‘సిట్’ తన చార్జిషీటులో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా... ‘అందులో పంది కొవ్వు లేదు. గొర్రె కొవ్వు, చేప నూనెలను గుర్తించే శక్తి మాకు లేదు’ అంటూ ఐసీఏఆర్ అనే ఒక డీమ్డ్ యూనివర్సిటీ నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఇచ్చిన నివేదికను పట్టుకుని చిందులు వేస్తోంది. తమ హయాంలో నెయ్యి పేరిట 60 లక్షల కిలోల రసాయన మిశ్రమాన్ని టీటీడీకి సరఫరా చేసి నీచానికి పాల్పడటం ఒక ఎత్తయితే... ‘అందులో జంతువుల కొవ్వు లేదు కాబట్టి చంద్రబాబు సారీ చెప్పాలి’ అని డిమాండ్ చేయడం మరో ఎత్తు. అది నెయ్యే కాదన్నది నిజం! అందులో... జంతువుల కొవ్వు కలిసిందన్నదీ నిజం! ఎన్‌డీడీబీ నివేదిక ఆధారంగానే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది’ అని సంచలన ప్రకటన చేశారు. అప్పుడే జగన్ తనదైన శైలిలో తికమక ప్రకటనలు చేశారు. ‘ఆవుకు ఆరోగ్యం బాగలేకున్నా అది ఇచ్చే పాలు కొంచెం అటూఇటుగా ఉంటుంది. దానివల్ల కూడా జంతువుల కొవ్వు కనిపిస్తుంది. అదేం తప్పు కాదు’ అంటూ వితండ వాదం చేశారు. ఇప్పుడు... అసలు అది నెయ్యే కాదని రుజువయ్యాక, ‘జంతువుల కొవ్వు లేదుకదా’ అంటూ తప్పుడు ప్రచారాన్ని జనంలోకి వదులుతున్నారు.
ఎన్‌డీడీబీ... ఏం చెప్పిందంటే...: ‘ఎన్‌డీడీబీ - కాల్ఫ్’ డెయిరీ రంగంలో అత్యుత్తమ పరిశోధనా కేంద్రం. జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డుకు అనుబంధంగా 2009లో దీనిని ఏర్పాటు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించినిర్ధారించడంలో జాతీయ స్థాయిలో దీనికి మించిన వ్యవస్థ మరొకటి లేదు. టీటీడీ 2024 జూలైలో స్వాధీనం చేసుకున్న రెండు ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్‌ను ఎన్‌డీడీబీ- కాల్ఫ్‌కు పంపించారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆ సంస్థ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ‘సిట్’ తన చార్జిషీటులో పొందుపరిచింది. మరోవైపు... ‘నెయ్యి’ శాంపిళ్లను హరియాణాలోని ‘ఐసీఏఆర్ - నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’కు కూడా పంపించారు. ఇది... డీమ్డ్ యూనివర్సిటీ. తమకు అందిన నమూనాల్లో పంది కొవ్వు (ల్యార్డ్) ఆనవాళ్లు లేవని ఆ సంస్థ తెలిపింది. అదే సమయంలో... తమ సొంత ‘మెథడాలజీ’ ప్రకారం, ఎప్పుడూ చేసే ప్రక్రియకు భిన్నంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ‘సాధారణంగా ఇలాంటి పరీక్షలు మేం చెయ్యం. కానీ, అడిగారు కాబట్టి చేశాం. మేం అనుసరించిన మెథడ్‌ను థర్డ్‌పార్టీ ధ్రువీకరించాల్సి ఉంది’ అని కూడా స్పష్టం చేసింది. తమకు వచ్చిన నమూనాల్లో గొర్రె కొవ్వు (ట్యాలో), చేప నూనె (ఫిష్ ఆయిల్) కలిసిందో, లేదో నిర్ధారించేంత పరిజ్ఞానం తమకు లేదని తెలిపింది. అంతేతప్ప... అందులో ఆ కొవ్వులు లేవని ధ్రువీకరించలేదు. వైసీపీ మాత్రం ‘జంతువుల కొవ్వు కలవలేదు’ అంటూ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ‘ఉల్టా చోర్...’ తరహాలో చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరం!
జగన్ హయాంలో నెయ్యి పేరిట తిరుమలకు సరఫరా చేసిన ‘రసాయన మిశ్రమం’లో జంతువుల కొవ్వు లేనే లేదా? ‘ఉంది’ అంటూ చంద్రబాబు రాజకీయం చేశారా? సజ్జల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లుగా చంద్రబాబు క్షమాపణలు చెప్పాలా? అసలు... అందులో జంతువుల కొవ్వు కలవలేదని ఎవరు నిర్ధారించారు? వైసీపీ వారు తమకు తాము ‘లేదు’ అనుకుంటే సరిపోతుందా? ఈ ప్రశ్నలకు ఇవిగో సమాధానాలు...
ఇది... చార్జిషీట్‌లో ‘సిట్’ వెల్లడించిన సంగతి. ‘నెయ్యి’లో వెజిటబుల్ ఫ్యాట్స్‌తోపాటు తక్కువ స్థాయిలో జంతువుల కొవ్వులు (గొర్రె కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె) కూడా ఉన్నట్లు ‘సిట్’ తన చార్జిషీటులోనే పేర్కొంది.
ఇది... ఐసీఏ
ఆర్-ఎన్‌డీఆర్‌ఐ ఇచ్చిన నివేదిక. తమకు అందిన శాంపిళ్లలో పందికొవ్వు లేదని... గొర్రె కొవ్వు, చేప నూనెలను గుర్తించే పరిజ్ఞానం తమకు లేదని ఆ సంస్థ తెలిపింది. అంతేకాదు... తమ మెథడాలజీని ‘థర్డ్‌పార్టీ’ నిర్ధారించాల్సి ఉందని తనమీద తనకే నమ్మకంలేదని తేల్చేసింది.

