Share News

మావటిని తొండంతో కొట్టి.. తొక్కిన ఏనుగు

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:44 AM

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆస్థాన ఏనుగు(శ్రీనిధి) తన మావటినే తొండంతో కొట్టి.. కాలితో తొక్కింది

మావటిని తొండంతో కొట్టి.. తొక్కిన ఏనుగు
maavati

  • తిరుచానూరులో ఆస్థాన గజరాజు వీరంగం

  • బాధితుడి పరిస్థితి ఆందోళనకం

తిరుచానూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆస్థాన ఏనుగు(శ్రీనిధి) తన మావటినే తొండంతో కొట్టి.. కాలితో తొక్కింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అమ్మవారి వాహన మండపంలో ఊంజల్‌సేవలో భాగంగా గజశాల నుంచి శ్రీనిధి, అవనిజ అనే రెండు రెండు ఏనుగులను మావటీలు సాయంత్రం 5.15గంటల సమయంలో మూడో నంబరు గేటు నుంచి తీసుకొస్తున్నారు. అమ్మవారి రథం సమీపంలో గేటు తీస్తున్న గోశాలలో పనిచేసే రవిని ఏనుగు తొండంతో కొట్టింది. దాంతో ఏనుగును మావటి చంద్రశేఖర్‌ అంకుశంతో నియంత్రించబోయాడు. అది ఒక్కసారిగా ఎదురుతిరిగి ఘీంకరిస్తూ మావటిని తొండంతో కొట్టి.. కింద పడేసి ఛాతీపై తొక్కింది. అతడు అక్కడికక్కడే రక్తం కక్కుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పక్కనే ఉన్న మరో ఏనుగు మావటి చిన్నప్పరెడ్డి, మరికొందరు అప్రమత్తమై ఏనుగును కట్టడి చేసి కాళ్లను గొలుసులతో బంధించారు. ఏనుగు ఘీంకారానికి భక్తులు పరుగులు తీశారు. మావటి చంద్రశేఖర్‌కు ప్రథమ చికిత్స చేసి.. స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మావటి ఛాతీపై ఏనుగు తొక్కడంతో కుడిపక్కనున్న ఎముకలు విరిగిపోయాయని స్విమ్స్‌ క్యాజువాలిటీ మెడికల్‌ అధికారి డాక్టర్‌ భారతి తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 05 , 2026 | 04:47 AM