రాజమండ్రిలో పులి సంచారం.. జనాలను అలర్ట్ చేసిన అటవీ శాఖ
ABN , Publish Date - Apr 23 , 2026 | 09:01 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండలం, కాపవరం గ్రామ పరిధిలో ఉన్న పాండవుల మెట్టపై పెద్ద పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
రాజమండ్రి, ఏప్రిల్ 23: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండలం, కాపవరం గ్రామ పరిధిలో ఉన్న పాండవుల మెట్టపై పెద్ద పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలను తాజాగా అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మెట్ట ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన అటవీశాఖ అధికారులు.. ఆ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం గమనించడానికి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటూ ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు.
పులి సంచారంపై అధికారుల ధృవీకరణతో కాపవరం, చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. చీకటి పడితే గ్రామాల్లోకి ఎక్కడ వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరోవైపు స్థానికులకు అటవీ అధికారులు కీలక హెచ్చరికలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పశువులను మేత కోసం అటవీ ప్రాంతం లేదా మెట్ట వైపు తోలుకెళ్లవద్దని, రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని తెలిపారు. ఒకవేళ పులి కనిపిస్తే.. వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మే 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తాం