రాజమహేంద్రవరం ప్రాంతంలో పులి సంచారం.. రామదుర్గంలో హై అలర్ట్
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:28 PM
రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోని రామదుర్గం కొండపై పులి సంచరిస్తోందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. పులి సంచరిస్తున్న విషయం తెలియక సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన 50 మంది సందర్శకులు విహారయాత్రకు వెళ్లారు.
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 1: రామదుర్గం కొండపై పులి సంచరిస్తోందనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పులి సంచరిస్తున్న విషయం తెలియక సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన 50 మంది సందర్శకులు విహారయాత్రకు వెళ్లారు. కొండపై పులి సంచరిస్తున్న విషయం తెలిశాక వారు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు.. సందర్శకుల కుటుంబ సభ్యులూ భయాందోళనకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి, ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. కొండపై పులి కదలికల గురించిన సమాచారంపై ఎంపీ కార్యాలయ ప్రతినిధులు కలెక్టర్, అటవీ శాఖాధికారితో మాట్లాడారు. పరిస్థితి తీవ్రతను వివరించి, అక్కడున్న సందర్శకులను సురక్షితంగా తీసుకురావాలని కోరారు.
దీంతో అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సందర్శకులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ట్రాక్టర్ల సాయంతో కొండపైకి వెళ్లారు. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున, అత్యంత జాగ్రత్తగా వారిని కిందికి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. పులి సంచారం దృష్ట్యా స్థానిక గ్రామస్థులు, భక్తులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి తొలి దశ ‘జనగణన 2027’..
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు