Share News

మింగేసిన రాకాసి అల!

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:49 AM

పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు బాలురను రాకాసి అల మింగేసింది. వారిలో ఒకరి మృతదేహం లభ్యమవ్వగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మింగేసిన రాకాసి అల!

  • ఒకరి మృతదేహం లభ్యం.. విశాఖ తీరంలో విషాదం

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు బాలురను రాకాసి అల మింగేసింది. వారిలో ఒకరి మృతదేహం లభ్యమవ్వగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల కథనం మేరకు.. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో విశాఖ నగర పరిధిలోని మధురవాడ సమీప.. పోతినమల్లయ్యపాలెం, వాంబే కాలనీలకు చెందిన సత్తారువ సూర్యప్రకాశ్‌ (14), సత్తారువ హేమంత్‌, సబ్బవరపు రితేశ్‌ (14), పి.ప్రశాంత్‌ (14), పసగడ హేమంత్‌కుమార్‌, ఆనమకొండ నగేశ్‌లు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు భీమిలి బీచ్‌రోడ్డులో ఐటీ పార్కు జంక్షన్‌ సమీపానున్న బీచ్‌కు వచ్చారు.

సూర్యప్రకాశ్‌, రితేశ్‌, పి.ప్రశాంత్‌, సత్తారువ హేమంత్‌ సముద్రంలోకి దిగగా, పసగడ హేమంత్‌కుమార్‌, ఆనమకొండ నగేశ్‌ ఒడ్డున ఉన్నారు. నలుగురు బాలురు మోకాళ్ల లోతు నీటిలో ఉండగా ఒక్కసారిగా భారీ అల వారిని తాకింది. ఈ క్రమంలో భవానీ మాలలో ఉన్న హేమంత్‌ ఒడ్డునపడగా, అతడి సోదరుడు సూర్యప్రకాశ్‌తో పాటు రితేశ్‌, ప్రశాంత్‌ లోనికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌, మెరైన్‌ పోలీసులు, పోతినమల్లయ్యపాలెం పోలీసులు, లైఫ్‌ గార్డులు, స్థానిక మత్స్యకారులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. వాంబే కాలనీకి చెందిన పి.ప్రశాంత్‌ (14) మృతదేహం లభ్యమైంది. సూర్యప్రకాశ్‌, రితేశ్‌ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ముగ్గురూ మధురవాడలోని సృజన పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

కుటుంబ సభ్యుల రోదనలు

గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీరానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. విషయం తెలిసిన వెంటనే విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్జీ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:49 AM