Share News

30రోజులు.. మూడు తుఫాన్లు

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:03 AM

ఒక్క తుఫాన్‌కే తీరం అతలాకుతలమవుతుంది. రైతాంగం కకావికలమవుతుంది.

30రోజులు.. మూడు తుఫాన్లు
APRAIN

  • అర్నబ్‌, మురసు... ఇప్పుడు అక్వాన్‌!

  • కోలుకోలేని విధంగా దెబ్బ మీద దెబ్బ

  • ఎల్‌నినో వచ్చిన 1987, 2026లో మూడేసి తుఫాన్లు

విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఒక్క తుఫాన్‌కే తీరం అతలాకుతలమవుతుంది. రైతాంగం కకావికలమవుతుంది. అంతులేని నష్టం మిగులుతుంది! అదే... నెలరోజుల వ్యవధిలో మూడు తుఫాన్లు తరుముకొస్తే! ఇప్పుడు అదే జరుగుతోంది. అర్నబ్‌, మురసు... ఇప్పుడు అక్వాన్‌! ఇలా వెంటవెంటనే మూడు తుఫాన్లు రావడం అత్యంత అరుదు! ఇలా గతంలో 1987లో జరిగింది. విచిత్రం ఏమిటంటే... ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎల్‌నినో ఏడాదిలోనే ఇలా మూడు తుఫాను ముప్పులు ముంచుకొచ్చాయి. తుఫాన్ల వల్ల కోస్తాకు ఏటా నష్టం వాటిల్లుతూనే ఉంది. ఈ ఏడాది నెల రోజుల వ్యవధిలో మూడు తుఫాన్లు సంభవించడం రైతాంగానికి కోలుకోలేని దెబ్బగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా ఒకసారి ఎల్‌నినో వచ్చిన ఏడాది (1987) నెల రోజుల్లో మూడు తుఫాన్లు కోస్తాంధ్రలో తీరం దాటాయి. భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం 1987లో ఎల్‌నినో కారణంగా తీవ్రమైన కరవు వచ్చింది. అయితే ఆ సంవత్సరం అక్టోబరు 16న తుఫాన్‌ ఒంగోలు వద్ద తీరం (అప్పట్లో తుఫాన్‌లకు పేర్లు పెట్టే సంప్రదాయం లేదు) దాటింది. పక్షం రోజుల వ్యవధిలో నవంబరు 2న తీవ్ర తుఫాన్‌ దక్షిణ కోస్తాను ముంచెత్తుతూ నెల్లూరు వద్ద తీరం దాటింది. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే నవంబరు 13న తీవ్ర తుఫాన్‌ మచిలీపట్నానికి దక్షిణంగా తీరం దాటింది. అదేమాదిరిగా ఈ ఏడాది అక్టోబరు 28న అర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ నరసాపురం సమీపాన తీరం దాటగా, నవంబరు 3న మురసు తుఫాన్‌ ఒంగోలు, చీరాల మధ్య విరుచుకుపడింది.


ఈ రెండు తుఫాన్‌ల నుంచి రైతాంగం ఇంకా కోలుకోలేదు. ఈలోగానే ‘అక్వాన్‌’ తుఫాన్‌ భయపెడుతోంది. ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారి 20న మచిలీపట్నం సమీపాన తీరం దాటుతుందని తాజా గా అంచనావేశారు. ఈనెల 20వతేదీ కల్లా తీరం దాటే ప్రాంతం మార్పు చెందే అవకాశం ఉంది. కోస్తాలో తుఫాన్‌ అంటేనే దివిసీమ విలయతాండవం గుర్తొస్తుంది. అత్యంత ప్రా ణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఆ తుఫాన్‌ 1977 నవంబరు 19న తీరం దాటింది. 49 సంవత్సరాల తరువాత అదే నవంబరు 19, 20 తేదీల్లో తుఫాన్‌ మచిలీపట్నం పరిసరాల్లో తీరం దాటనుంది. అలాగే 1977 అక్టోబరు 31న నెల్లూరులో మరో తుఫాన్‌ తీరం దాటిం ది. కాగా 2013 నవంబరు 22న హెలెన్‌, నవంబరు 28న లెహర్‌ తుఫాన్లు ఏపీలో తీరం దాటాయి.

Updated Date - Nov 17 , 2026 | 06:04 AM