వచ్చేశాయోచ్!
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:47 AM
పులికాట్ సరస్సుకు ‘విదేశీ అతిఽథుల’ రాకతో సందడి మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి అడవులు, గిరులు, సాగరాలను దాటి వేలాది రంగురంగుల పక్షులు ఎగిరొస్తున్నాయి.
పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి
శీతాకాలం వచ్చేసింది. పులికాట్ సరస్సుకు ‘విదేశీ అతిఽథుల’ రాకతో సందడి మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి అడవులు, గిరులు, సాగరాలను దాటి వేలాది రంగురంగుల పక్షులు ఎగిరొస్తున్నాయి. ఫ్లెమింగోలు, పెలికాన్స్, నల్ల కాళ్ల కొంగలతో పాటు వివిధ రకాల పక్షులు తమ కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. సూర్యుడు ఉదయించే వేళ నుంచి సరస్సులో నీటిపై చక్కర్లు కొట్టే పక్షులు, మరోవైపు తెరచాప పడవలు, చేపల వేటతో ప్రకృతి అందాలు రమనీయంగా మారాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రాంతంలోని పులికాట్ సరస్సుకు ఇప్పటికే 50 వేలకుపైగా పక్షులు వచ్చినట్లు అంచనా. పులికాట్ సరస్సుకు ఏటా 150 రకాలకు పైగా విహంగాలు సైబీరియా, నైజీరియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనాతో పాటు పలు ఐరోపా దేశాల నుంచీ వలస వస్తుంటాయి. ఆ దేశాల్లో మంచు, చలి ఎక్కువ. మనుగడ కోసం శీతాకాలంలో ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం ఉండటంతో పులికాట్ సరస్సుకు చేరుకుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో మళ్లీ స్వస్థలాలకు వెళ్లిపోతాయి. పులికాట్‌లో సముద్రం నుంచి ఉప్పునీరు, నదుల నుంచి మంచి నీరు కలవడంతో మత్య్స సంపద ఆపారంగా దొరుకుతుంది. అక్కడి పరిసరాల్లోని చెట్లు అతిథి పక్షులకు ఆవాసాలుగా మారాయి. - సూళ్లూరుపేట-ఆంధ్రజ్యోతి