ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు!
ABN , Publish Date - Aug 04 , 2026 | 08:23 AM
తెలిసినవారి ఇంట్లో ముగ్గురు యువకులు దొంగతనానికి తెగబడ్డారు. చోరీ సొత్తును సమంగా పంచుకున్నారు. తీరా ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో సొత్తును మూటగట్టి దొంగతనం చేసిన ఇంట్లోకే విసిరేశారు. ఆపై సంఘ పెద్దలకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో.. వారు ముగ్గురు నిందితులనూ పోలీసులకు అప్పగించారు.
దొంగిలించిన సొత్తును అదే ఇంట్లోకి విసిరేసిన దొంగలు
కొంత వాడేసుకున్నాం.. ఇవ్వలేమని లేఖ
పోలీసులకు అప్పగించిన పెద్దలు
కాకినాడ జిల్లా కరపలో వింత ఘటన
కరప (ఆంధ్రజ్యోతి): తెలిసినవారి ఇంట్లో ముగ్గురు యువకులు దొంగతనానికి తెగబడ్డారు. చోరీ సొత్తును సమంగా పంచుకున్నారు. తీరా ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో సొత్తును మూటగట్టి దొంగతనం చేసిన ఇంట్లోకే విసిరేశారు. ఆపై సంఘ పెద్దలకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో.. వారు ముగ్గురు నిందితులనూ పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా కరప మండలం కరపలో జరిగిన ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కరప శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన నామాల గణేశ్ కాలనీకి సమీపంలో ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. కుటుంబంతో కలిసి తిరునాళ్లలో, ఊరూరా తిరుగుతూ ఫ్యాన్సీ సామాన్లు అమ్ముతూ జీవనం సాగించే ఆయన, గడచిన జూన్ 23న తిరుపతి వెళ్లారు.
తిరిగి, రాజునగర్‌కాలనీలో బంధువు ఒకరు మృతిచెందారని తెలిసి జూలై 18న తిరిగి వచ్చారు. ఇంటి ద్వారం తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించారు. ఇంట్లో రూ.6.25లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.58వేల నగదు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసుల హడావుడి, దొంగతనంపై కాలనీలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో.. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో అలజడి ప్రారంభమైంది. దొరికిపోతామనే భయంతో గత శనివారం అర్ధరాత్రి బంగారు నగలను ఒక పర్స్‌లో పెట్టి చోరీ చేసిన ఇంట్లోకే విసిరేశారు. తెల్లారాకా.. పోయిన సొత్తు కనిపించడంతో గణేశ్ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
‘మేము చేసింది తప్పే.. మేము రూ.22వేలు ఇవ్వలేం.. అవి వాడేసుకున్నామంటూ’ దొంగలు రాసిన లెటర్ కూడా ఆ పర్స్‌లో దొరికింది. దీంతో తెలిసినవారే ఈ పనికి పాల్పడినట్టు గ్రహించిన బాధితులు.. జరిగిన విషయాన్ని కాలనీలోని సంఘ పెద్దలకు తెలిపారు. కాలనీ కట్టుబాట్ల ప్రకారం వెంటనే పెద్దలు కాలనీవాసులందరినీ పిలిచి పంచాయతీ పెట్టారు. ఈ చోరీ చేసింది మనలోనివారేనని.. మర్యాదగా చెపితే ఏ శిక్షా లేకుండా కాపాడతామని, లేకపోతే కులం కట్టుబాట్ల ప్రకారం బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరించారు.
దీంతో గత్యంతరం లేక ఆదివారం రాత్రి ఆ ముగ్గురు యువకులు పెద్దలకు ఫోన్ చేసి ఆ దొంగతనం తామే చేశామంటూ (వీరిలో ఇద్దరు మైనర్లు అని తెలిసింది) ఒప్పుకొన్నారు. సోమవారం ఉదయం కాలనీ పెద్దలు ఆ ముగ్గురినీ పంచాయతీకి పిలిచి చేసిన తప్పుపై నిలదీశారు. ఈ తతంగమంతా తెలుసుకున్న కరప పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి.. వారి నుంచి మిగిలిన బంగారు ఉంగరం, చెవిదిద్దుల జత, వెండి లాకెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్