Share News

విద్యుత్‌ డిమాండ్‌కు థర్మల్‌తో చెక్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:07 AM

రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, వ్యవసాయ అవసరాలు, పట్టణీకరణ వల్ల విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకోవడానికి, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మరో 1,600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది

విద్యుత్‌ డిమాండ్‌కు థర్మల్‌తో చెక్‌

  • 1,600 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌!

  • సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మాణానికి సన్నాహాలు

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, వ్యవసాయ అవసరాలు, పట్టణీకరణ వల్ల విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకోవడానికి, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మరో 1,600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. విద్యుత్తు చట్టం 2003లోని సెక్షన్‌ 63 ప్రకారం టారిఫ్‌ ఆధారిత పోటీ బిడ్డింగ్‌ ద్వారా డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఓన్‌, అండ్‌ ఆపరేట్‌ (డీబీఎఫ్ఓఓ) విధానంలో ఈ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ(సీఈఏ) రిసోర్స్‌ అడిక్వసీ ప్లాన్‌ ప్రకారం 2035-36 నాటికి రాష్ట్రానికి 5,588 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు సామర్థ్యం అదనంగా అవసరం అవుతుంది. ఇందులో తొలి దశలో 1,600 మెగావాట్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లభించింది. వీటిని సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సౌర, పవన విద్యుత్తు అందుబాటులో లేని సాయంత్రం సమయం (పీక్‌ అవర్స్‌)లో గ్రిడ్‌ స్థిరత్వాన్ని కాపాడేందుకు నిరంతర బేస్‌ లోడ్‌ విద్యుత్తు అందించడం ముఖ్యం. దీనికి థర్మల్‌ విద్యుత్తు అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,610 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ ప్లాంట్లున్నాయి. ఇవి సగటున 70 నుంచి 85 శాతంపైగా పీఎల్‌ఎఫ్‌తో నిలకడగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి భారీగా పెరుగుతున్నందున పగటి వేళల్లో పునరుత్పాదక ఇంధనం ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడు థర్మల్‌ ప్లాంట్లను ఫ్లెక్సిబుల్‌ జనరేషన్‌ (పాక్షిక లోడ్‌) విధానంలో నడుపుతున్నారు. పీక్‌ అవర్స్‌లో వీటిని పూర్తి సామర్థ్యంతో గ్రిడ్‌ స్థిరత్వానికి వినియోగిస్తున్నారు.


జీవితకాలం దాటినా..

థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల సాధారణ సాంకేతిక జీవితకాలం కమిషనింగ్‌ తేదీ నుంచి సాధారణంగా 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఎన్‌టీటీపీఎస్‌లో 1, 2, 3, 4, 5, 6 యూనిట్లు 1979 నుంచి 1995 మధ్య ప్రారంభయ్యాయి. సాంకేతికంగా వాటి జీవిత కాలం దాటినప్పటికీ ఆధునికీకరణ ద్వారా ఇప్పటికీ నడిపిస్తున్నారు. 2009-10లో యూనిట్‌ 7, 2024లో యూనిట్‌ 8 ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్త విద్యుత్తు డిమాండ్‌ దృష్ట్యా పాత థర్మల్‌ ప్లాంట్లను 2030 వరకు రద్దు చేయవద్దని సీఈఏ సూచించింది. దీన్ని పక్కాగా అమలు చేస్తే ఎన్‌టీటీపీఎస్‌లో ఆరు యూనిట్ల ఉత్పత్తి 2030కి ముగిసిపోతుంది. ఇక కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో 1 నుంచి 4 యూనిట్లు 1994 నుంచి 2007 మధ్య ప్రారంభమయ్యాయి. ఇవి 2035 వరకు పనిచేయగలవు. 2010లో యూనిట్‌ 5, 2018లో యూనిట్‌ 6 కమీషన్‌ చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1, 2 యూనిట్లు 2015-16లో ప్రారంభమయ్యాయి. యూనిట్‌ 3 ఇటీవలే కమిషనైంది. ఈ మొత్తం థర్మల్‌ యూనిట్లలో కృష్ణపట్నంలోని 3యూనిట్లు, ఎన్‌టీటీపీఎ్‌సలోని 8వ యూనిట్‌ సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో పనిచేస్తున్నాయి. వీటి జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీలో బొగ్గు వినియోగం సబ్‌ క్రిటికల్‌ వాటికన్నా 5 నుంచి 10 శాతం తక్కువగా ఉంటుంది.

Updated Date - Aug 29 , 2026 | 04:07 AM