ఎన్నికల కోడ్ వేళ వైసీపీలో కలకలం
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మించిన రాజకీయ వేడి కనిపిస్తోంది. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజే మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రమేయం ఉందని భావిస్తున్న ఐదు కేసుల దర్యాప్తులో అనూహ్య పురోగతి కనిపించింది.
జగన్ ప్రమేయం ఉన్న ఐదు కేసుల్లోఒకేరోజు పురోగతి
అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ
సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం
వివేకా హత్య కేసులో మనీ ట్రయల్‌పై
అవినాశ్‌ను విచారించిన ఈడీ
‘లడ్డూ’ కేసులో నిందితుల ఆస్తుల జప్తు
‘ఓబులాపురం’స్కామ్‌లో కోర్టుకు శ్రీలక్ష్మి
మద్యం రవాణా స్కామ్‌లో మరో ఐఏఎస్
రజత్ భార్గవ ఈడీ ఎదుట హాజరు
అమరావతి -(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మించిన రాజకీయ వేడి కనిపిస్తోంది. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజే మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రమేయం ఉందని భావిస్తున్న ఐదు కేసుల దర్యాప్తులో అనూహ్య పురోగతి కనిపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, సీఐడీ ఉన్నపళంగా దూకుడును పెంచాయి. జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య ఉదంతంలో మనీ ట్రయల్‌పై విచారిస్తున్న ఈడీ.. వైసీపీ ఎంపీ, వరసకు జగన్ సోదరుడు వైఎస్ అవినాశ్‌రెడ్డిని బుధవారమే విచారించింది. అలాగే.. మిగతా కేసుల్లోనూ జగన్ బంధుగణాన్ని, మిత్రులను .. సన్నిహితులను విచారించేందుకు దర్యాప్తు సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీబీఐ, ఈడీ, సీఐడీ దర్యాప్తును స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుభూతిగా మలచుకునేందుకూ అవకాశం లేకపోవడంతో, జగన్‌కు ఏమీ పాలుపోవడం లేదు. కూటమి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక.. సీట్లు సర్దుబాటుపై హడావిడిగా ఉన్నారు. మరోవైపు వైసీపీలో కనీసం చప్పుడే లేదు. అభ్యర్థుల ఎంపిక కంటే, అక్రమాస్తులు, బాబాయ్ వివేకా హత్య, ఓబులాపురం గనుల అక్రమాల కేసుల్లో... విచారణను ఎదుర్కొనడంపైనే దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి. ఫలితంగా వైసీపీ శిబిరంలో దిగులు, ఆందోళన కలగాపులగంగా కనిపిస్తున్నాయి.
నాడు ముఖ్యమంత్రి హోదాలో పదవిని బూచిగా చూపి, న్యాయస్థానానికి హాజరుకాకుండా వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ జగన్ పదేళ్లు గడిపేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో, ఆ వెసులుబాటు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో సీబీఐతో పాటు ఈడీ కూడా రోజువారీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇక.. ఓబులాపురం గనుల కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు రిటైర్డ్ ఐఎఎస్ శ్రీలక్ష్మి హాజరయ్యారు. దశాబ్దాలుగావిచారణలే తప్ప తుది తీర్పువెలువడని కేసు ఇది. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి బుధవారం సీబీఐ కోర్టుకు హాజరుకావడంపై వైసీపీ శిబిరంలో ఆలజడి కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఈడీ విచారించింది.
గురువారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ రసాయనాలు కలిసిన నెయ్యి వాడిన కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల భారీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు నాటి ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ హాజరయ్యారు. మద్యం రవాణా టెండర్ల అక్రమాలపై చంచల్‌గూడ జైలులో ఉన్న కారుమారి సునీల్‌ను ఏపీ సీఐడీ, ఈడీ విచారించాయి. ఇలా.. నిద్రాణంగా ఉన్న కేసులన్నీ ఒక్కసారిగా జగన్ అండ్ కో మెడను అనకొండలా చుట్టుకున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కనిపించడం లేదు. గతంలో .. రప్పా రప్పా అంటూ హెచ్చరికలు చేసిన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై పెదవి విప్పడం లేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..