‘తుపాకులగూడెం’పై రేవంత్ పట్టు!
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:55 AM
గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం చంద్రబాబుకు తెలిపారు.
అక్కడి నుంచే గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలంటున్నారు!!
చంద్రబాబుకు చెప్పిన కేంద్ర జలశక్తి మంత్రి
ఢిల్లీలో గంటన్నర పాటు చర్చలు
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఢిల్లీలో గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులతోపాటు పాటిల్‌ను చంద్రబాబు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రూ.58 వేల కోట్లతో తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి ఆమోదం తెలపాలని పాటిల్‌కు సీఎం వినతిపత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలవరం-నల్లమలసాగర్-బనకచర్ల-కావేరి అనుసంధాన పథకంతోనే ప్రధాని మోదీ ఆశిస్తున్న అనుసంధాన ప్రక్రియ వాస్తవ రూపం దాలుస్తుందని చంద్రబాబు అన్నారు. దీంతో ప్లాన్-బీ కింద రెండో ఆప్షన్‌గా దీనిని పరిగణనలోకి తీసుకుంటామని పాటిల్ హామీ ఇచ్చారు. అమరావతి-ఖరగ్‌పూర్ నడుమ ఆరు వరుసల జాతీయ రహదారి వస్తున్నందున.. ఈ రహదారితో పోలవరం ఐకానిక్ బ్రిడ్జిని అనుసంధానించవచ్చని తెలిపారు. దీనిపై గడ్కరీని సంప్రదించాలని సూచించారు. ఇంకోవైపు.. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ రోజూ ఒకటిన్నర టీఎంసీ దాకా విద్యుదుత్పత్తికి వాడేస్తోందని.. దానిని అడ్డుకోవాలని పాటిల్‌ను రాష్ట్ర అధికారులు కోరారు. ఆ రాష్ట్రానికి కేఆర్‌ఎంబీ ఒకసారి లేఖ రాసి వదిలేసిందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు