టీచర్‌ను ఇంటికి పిలిచి కొట్టారు
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:13 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు.
ప్రధానోపాధ్యాయురాలిని తిట్టారు
ఎమ్మెల్యే కొలికపూడిపై ‘పల్లా’కు ఫిర్యాదు
విజయవాడ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి.. పీఈటీ టీచర్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడడంతో పాటు కర్రతో కొట్టినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు పీఈటీ మేరుగు రమేశ్ ఆరోపణలను బాలకోటయ్య ఉటంకించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న మేరుగు రమేశ్‌ను ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు డిప్యూటీ డీఈవో ద్వారా ఎమ్మెల్యే ఇంటికి పిలిపించారు. అదే సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభలతను కూడా పిలిపించి దుర్భాషలాడారు. పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలకు ఎమ్మెల్యేను ముఖ్య అతిథిగా ఆహ్వానించకుండా గ్రామానికి చెందిన టీడీపీ నేత గోటేటి సుబ్రహ్మణ్యంను ఆహ్వానించడమే ఈ ఘటనకు కారణం. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నారు’’ అని బాలకోటయ్య అన్నారు. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై గతంలోనూ ఫిర్యాదులు రావడాన్ని లేఖలో ప్రస్తావించారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం