బాబు అపర భగీరథుడు
ABN , Publish Date - May 29 , 2026 | 04:26 AM
నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం పోసిన అపర భగీరథుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు.
నిర్లక్ష్యానికి గురైన నీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం
ఇరిగేషన్ గురించి చెప్పాలంటే టీడీపీకి ముందు.. టీడీపీ తర్వాత
పార్టీ జెండాలో నాగలి పెట్టడంలో ఎన్టీఆర్ దూరదృష్టి
‘అన్నదాతకు అండగా’ తీర్మానానికి ఆమోదం
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం పోసిన అపర భగీరథుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. నాగలి గుర్తును పార్టీ జెండాలో పెట్టి రైతు ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచిందని చెప్పారు. గురువారం మహానాడులో ‘అన్నదాతకు అండగా’ అనే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. దీనిని బలపరుస్తూ పలువురు నేతలు, పరుచూరు నియోజకవర్గానికి చెందిన రైతు మాట్లాడారు. ధూళిపాళ్ల ప్రసంగిస్తూ.. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులతో రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఎన్టీఆర్ రైతులకు రూ.50కే హార్స్‌పవర్ అందించి వ్యవసాయానికి అండగా నిలిచారని చెప్పారు. బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చిన సాగునీటి ప్రాజెక్టుల వెనుక చంద్రబాబు విజన్ ఉందన్నారు. నదుల అనుసంధానానికి కృషిచేస్తున్నారని.. విజన్-2047లో భాగంగా 5 ప్రధాన నదులు, 69 ఉపనదులను అనుసంధానించనున్నట్లు తెలిపారు. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి చేరిందని, జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని.. ఆ ప్రాజెక్టుకు కేంద్రమిచ్చిన రూ.3500 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించిందని ధ్వజమెత్తారు. 23 నెలల్లోనే పోలవరానికి రూ.7862 కోట్ల అడ్వాన్స్ నిధులు రాబట్టామని చెప్పారు. అన్నదాతే రాష్ట్రానికి బలం అనే భావనతో టీడీపీ జెండాలో రైతులకు, నాగలికి ప్రాధాన్యమివ్వడం ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనే విధంగా ఉందన్నారు. చంద్రబాబు 1997లో నీటివినియోగదారుల సంఘాలను తీసుకొచ్చి రైతులకు నీటి నిర్వహణలో భాగస్వామ్యం కల్పించారని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. గత ప్రభుత్వం రీసర్వే నిడివి తగ్గించి 21 రోజులకు పరిమితం చేసి రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్తం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా మాట్లాడారు.
చంద్రబాబుపై పిచ్చిరాతలు..
తెలంగాణ టీడీపీ నేత దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. బుధవారం ఒక పత్రిక పిచ్చి రాతలు రాసిందని.. ఎవరో ఒక నాయకుడు తెలంగాణ పదం గురించి మాట్లాడిన చరిత్రను చంద్రబాబుకు ఆపాదిస్తూ విషపు రాతలు రాసిందని ధ్వజమెత్తారు. కమిటీలు వేసి తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేస్తామని యువనేత లోకేశ్ చెప్పగానే భయం పుట్టుకుని ఈ రాతలు రాశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నదుల అనుసంధానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామన్నారు.
లోకేశ్ మా ఊర్లో 130 బోర్లు తవ్వించారు...
రైతులు నీటి కోసం రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి, వర్షాలపై ఆధారపడి వ్యవసాయం సాగుతున్న సమయంలో లోకేశ్ పరుచూరు నియోజకవర్గంలోని తమ గ్రామానికి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకుని 130 జలసిరి బోర్లు తవ్వించారని టీడీపీ కార్యకర్త వేమయ్య చెప్పారు. వాగులపై 8 చెక్‌డ్యామ్‌లు నిర్మించి భూగర్భజలాలు పెరిగేలా చేశారని, నాగార్జునసాగర్ కాలువ పూడికతీతతో ప్రతి ఎకరాకు నీరందేలా చేశారన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందుతోందన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
మహానాడు వేదికగా సీఎం తీర్మానం
తెలుగుజాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గురువారం మహానాడు వేదికపై ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది. ఇది ప్రతీ తెలుగువారి కోరిక. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని కేందాన్ని కోరుతునా. దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకుడు మరొకరు లేరు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజకీయాల్లో కీలక ప్రాత పోషించింది. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్టీఆర్ పాలన రైతులకు అండ.. మహిళలకు భరోసా.. కార్మికులకు అభయం.. యువతకు దిక్సూచి అయింది. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదాన్ని శాశ్వత నినాదంగా ఎన్టీఆర్ మార్చారు. నిన్న లోకేశ్ ప్రతిపాదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్లను మనమే ప్రారంభిద్దాం. కేంద్రాన్ని మరోమారు కోరదాం’ అని చంద్రబాబు అన్నారు.
పథకాల్లో ఎన్టీఆర్, విజన్‌లో బాబు గ్రేట్
44 ఏళ్ల ప్రస్థానం.. పోరాటాలపై తీర్మానం
టీడీపీ 44 ఏళ్ల ప్రస్థానం.. పోరాటాలపై తీర్మానాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన చేసినప్పుడు ఆయన వెంట పెద్దపెద్ద వాళ్లు ఎవరూ రాలేదు. సామాన్యులు మాత్రమే అండగా నిలిచారు. పార్టీ పెట్టిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. శ్రీశైలం ప్రాజెక్టును సాగు, తాగునీరు ఇచ్చే విధంగా తెలుగుగంగకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే.. మిగులు జలాల పేరుతో తెలుగు గంగను అడ్డుకునే ప్రయత్నం వైఎస్ చేశారు. రామారావుపై అవినీతి ఆరోపణలు చేసి కోర్టుకు రాకుండా పారిపోయాడు. విజన్ 2020తో ఉమ్మడి రాష్ట్ర గతిని మార్చిన నాయకుడు చంద్రబాబు. దేశానికి లోకేశ్ దిక్సూచీగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహిళలకు 33ు రిజర్వేషన్లు ప్రకటించిన లోకేశ్ అభినందనీయుడు’ అని అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ.. 33ు మహిళా రిజర్వేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేశ్‌కు రాష్ట్ర మహిళల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. చెట్టుపై ఉన్న పక్షి కొమ్మను నమ్ముకోదని, తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. టీడీపీ కూడా తన కార్యకర్తల బలాన్నే నమ్ముకుంటుందని వ్యాఖ్యానించారు.