జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:59 AM
జగన్ కేసుల్లో రోజువారీ విచారణే కాదు.. రోజంతా విచారణ జరగాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇది దేశంలో అతిపెద్ద అవినీతి కేసు: సోమిరెడ్డి
అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జగన్ కేసుల్లో రోజువారీ విచారణే కాదు.. రోజంతా విచారణ జరగాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ కేసుల్లో రోజువారీ విచారణ జరపాలని ఈడీ పిటిషన్ వేయడం 100 శాతం కరెక్ట్ అని, ఇది ఎప్పుడో జరగాల్సిందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధానులు, ఉపప్రధానులపైన నమోదైన కేసుల్లోనే మూడేళ్లలో విచారణ పూర్తయిందని, భారీ అవినీతి కేసులో నిందితుడైన జగన్ రెడ్డి పదేళ్లుగా తప్పించుకోవడాన్నిబట్టి ఆయన చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతుడా అని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లకుపైగా అక్రమాస్తులు కూడగట్టిన జగన్ రెడ్డిపై 2011లో సీబీఐ కేసులు నమోదు చేసిందని, 15 ఏళ్లు గడుస్తున్నా విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావుపై మూడు కేసులు నమోదైతే మూడేళ్లలోనే విచారణ పూర్తయి కోర్టు తీర్పులు వచ్చాయన్నారు. రూ.43 వేల కోట్ల అక్రమాస్తులకు సంబంధించిన భారీ అవినీతి కేసులో ముద్దాయిగా ఉండి కూడా జగన్ రెడ్డి సీఎం సీటులో కొనసాగారని, దేశంలోనే ఇది భారీ అవినీతి కేసు.. కోర్టులో ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా డిశ్చార్జి పిటిషన్ల పేరుతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. హైకోర్టులో ఈడీ పిటిషన్లు దాఖలు చేయడంపై జగన్ పత్రిక గొంతుచించుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్