Share News

జనసేనకు సాలూరు కేటాయింపుపై టీడీపీ శ్రేణుల తీవ్ర అసంతృప్తి

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:19 AM

పార్వతీపు రం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జనసేనకు సాలూరు కేటాయింపుపై టీడీపీ శ్రేణుల తీవ్ర అసంతృప్తి

  • మంత్రి అచ్చెన్న వద్ద తమ్ముళ్ల ఆవేదన

  • కన్నీటి పర్యంతమైన మంత్రి గుమ్మిడి

సాలూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పార్వతీపు రం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో జనసేనకు 2 శాతం కూడా ప్రాబల్యం లేదని, పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన తమకు అన్యాయం ఎలా చేస్తారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు చైర్‌పర్సన్‌ పదవిని టీడీపీకే కేటాయించే లా అధిష్ఠానానికి విన్నవించాలని కోరారు. పట్టణంలోని మంత్రి సంధ్యారాణి నివాసం వద్ద శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

టీడీపీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బలమైన పార్టీగా ఎదిగింది. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ టీడీపీని లేకుండా చేయాలని చూశారు. చంద్రబాబును జైలులో పెట్టారు. ఆ క్లిష్ట సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అండగా నిలిచారు. పొత్తులు ఉన్నప్పుడు త్యాగాలు తప్పవు. అందరికీ పదవులు దక్కవు’ అని అచ్చెన్న అన్నారు. ఆయన మాట్లాడుతుండగానే టీడీపీ శ్రేణు లు నిరసన వ్యక్తం చేశాయి. సాలూరులో జనసేన కు అంతగా ప్రాబల్యం లేనప్పుడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఎలా కేటాయిస్తారంటూ నిలదీశాయి. మంత్రి సంధ్యారాణి కల్పించుకున్నారు.

‘అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో రెండింటిని జనసేనకు కేటాయించడం బాధాకరం. సాలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. పట్టణంలో జనసేనకు రెండు శాతం కూడా ప్రాబల్యం లేదు. అలాంటి పార్టీకి చైర్‌పర్సన్‌ పదవి కేటాయించడం నన్ను కలచివేస్తోంది’ అంటూ మంత్రి కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:19 AM