కూటమి సర్దుబాటు నేడు ఫైనల్!
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:16 AM
మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీలు బుధవారం తుది నిర్ణయానికి రానున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మూడు పార్టీల నడుమ జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమై...
పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
6 కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలు కోరిన జనసేన
4-24కి టీడీపీ ప్రతిపాదన!
అటు సీఎంతో మాధవ్, సత్యకుమార్ సమావేశం
బీజేపీకి ఒక కార్పొరేషన్-10 మున్సిపాలిటీలు!
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీలు బుధవారం తుది నిర్ణయానికి రానున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మూడు పార్టీల నడుమ జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమై స్థూలంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్‌తోపాటు మంత్రి నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేశ్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. మొత్తం 17 కార్పొరేషన్లలో 6, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 26 ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు తెలిసింది.
విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నంలలో 6 తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే వీటిలో 4 కార్పొరేషన్లను, 24 వరకు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు బీజేపీ నేతలు మాధవ్, మంత్రి సత్యకుమార్‌లు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీకి 1 మేయర్, 10 చైర్‌పర్సన్ స్థానాలివ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం. ఎవరు ఏయే స్థానాల నుంచి పోటీ చేయాలన్న దానిపై మంగళవారం అర్ధరాత్రి వరకు స్పష్టత రాలేదు. జనసేనకు మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలు స్థానాలివ్వాలని టీడీపీ భావిస్తోంది. అయితే మచిలీపట్నం బదు లు గుంటూ రు, ఏలూరుల్లో ఒకటి ఇవ్వాలని జనసేన అడిగినట్లు తెలుస్తోంది. బీజేపీ రాయలసీమ నుంచి ఓ కార్పొరేషన్ బరిలో నిలిచే అవకాశం ఉంది. బుధవారం ఉదయం జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటుపై సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.
టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎం పికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ కసరత్తు ప్రారంభించారు. జోనల్ కో-ఆర్డినేటర్ల ద్వారా ఆశావహుల జాబితాను తెప్పించుకోవడంతోపాటు స్థానిక నేతల నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఒక్కో స్థానాని కి 2-3 పేర్లను ఎంపిక చేసి ఐవీఆర్‌ఎస్ విధానంలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత