కూటమిలో తేలిన సీట్లు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:39 AM
మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దశల వారీగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
పార్టీల నడుమ కుదిరిన సర్దుబాటు?
జనసేనకు 4 కార్పొరేషన్లు..18 దాకా మున్సిపాలిటీలు ఇచ్చే చాన్స్!
బీజేపీకి ఒక నగరం-6 పట్టణాలు
సీఎం ఇంటిలో భేటీ.. రోజంతా చర్చలు
ఆపై జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కు వివరించిన మనోహర్
మళ్లీ ఫోన్లో చంద్రబాబు, జనసేనాని చర్చలు
సీట్ల సర్దుబాటుకు ఆమోదముద్ర
సీఎంతో బీజేపీ నేతల సమావేశం
స్నేహపూర్వక పోటీ ఉండొద్దని నిర్ణయం
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దశల వారీగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మొత్తం 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎవరు ఎన్ని చోట్ల, ఎక్కడెక్కడ పోటీచేయాలో ఖరారైనట్లు తెలిసింది. 4 కార్పొరేషన్లు, 18 వరకు మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం. మున్సిపల్ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పు కూడా ఉండే అవకాశమూ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక... బీజేపీ ఒక కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో పోటీచేయనున్నట్లు తెలిసింది. 12 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో టీడీపీ బరిలో నిలుస్తుందని సమాచారం.
ఈ మేరకు మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది.. అభ్యర్థుల ఎవరనే వివరాలతో గురువారం లేదా శుక్రవారం జాబితా విడుదల చేస్తారని అంటున్నారు. విజయవాడ, ఒంగోలు, కాకినాడ, తిరుపతి కార్పొరేషన్ల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీకి కేటాయించే కార్పొరేషన్‌పై స్పష్టత రావలసి ఉంది.
స్నేహపూర్వక పోటీ వద్దు..
రాష్ట్రంలో ఏ స్థానిక సంస్థలోనూ కూటమి పార్టీల నుంచి ఎవ్వరు కూడా స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో ఉండకూదని కూటమి నేతలు నిర్ణయించారు. ఎవరికి కేటాయించిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థి మాత్రమే బరిలో నిలవాలని, మిగిలిన పార్టీలు ఆ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని, నూరు శాతం గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని చంద్రబాబు కూటమి నేతలకు స్పష్టం చేశారు.
సుదీర్ఘంగా చర్చలు..
సీట్ల సర్దుబాటుపై బుధవారం రోజంతా కూటమి పార్టీల నేతల నడుమ విస్తృతంగా, సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉదయాన్నే టీడీపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు.. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేశ్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్.. సీఎం చంద్రబాబుతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఆ తర్వాత టీడీపీ ప్రతిపాదనలను జనసేనాని పవన్ కల్యాణ్‌కు తెలియజేసేందుకు జనసేన కార్యాలయానికి మనోహర్ వెళ్లారు. టీడీపీ ప్రతిపాదనలపై పవన్ కల్యాణ్ సానుకూలత వ్యక్తం చేయడంతో తిరిగి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన మనోహర్..
అదే విషయాన్ని టీడీపీ నేతలకు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. సీట్ల సర్దుబాటుకు ఆమోదముద్ర వేశారు. దీంతో రెండ్రోజులుగా సాగుతున్న సంప్రదింపులు సఫలమయ్యాయి. జనసేనతో చర్చలు ముగిశాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ సీఎం నివాసానికి చేరుకుని చర్చించారు. అవి కూడా సఫలమవడంతో కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటు విజయవంతమైంది.
కూటమిగానే పోటీ: బొలిశెట్టి శ్రీనివాస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీచేస్తామని.. కూటమి తరఫున ఒకే అభ్యర్థి, సింగిల్ అజెండాతో ముందుకెళ్తామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సీఎం నివాసం వద్ద విలేకరులకు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై కూటమిలోని మూడు పార్టీలకూ స్పష్టత ఉందన్నారు. ఎక్కడా స్నేహపూర్వక పోటీ ఉండదని, అయితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా పోటీ చేస్తామని తెలిపారు. సీట్ల కోసం మిత్రపక్షాల నడుమ ఎలాంటి గొడవలూ లేవని స్పష్టం చేశారు.
క్యాడర్ సంతృప్తి చెందేలా పోటీ: వంశీకృష్ణ
రాష్ట్రం బాగుకోసం జనసేన కట్టుబడి ఉందని, క్యాడర్ సంతృప్తి చెందేలా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని మరో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఎవరు ఎన్ని స్థానాలకు, ఎక్కడ నుంచి పోటీ చేయాలో మూడు పార్టీలకు అవగాహన ఉందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..