Share News

పరువు కోసం జగన్‌ పాట్లు

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:26 AM

పట్టణ స్థానిక ఎన్నికల సందర్భంగా పులివెందులలో ఓటు వేయకుండా వైసీపీ అధినేత జగన్‌ తెర తీసిన హైడ్రామాను కూటమి నేతలు దీటుగా ఎదుర్కొన్నారు

పరువు కోసం జగన్‌ పాట్లు
tdp logo

  • ఓటమి భయంతోనే పులివెందులలో డ్రామా

  • ఎస్‌ఈసీకి ఐదు ఘటనలపై టీడీపీ ఫిర్యాదు

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక ఎన్నికల సందర్భంగా పులివెందులలో ఓటు వేయకుండా వైసీపీ అధినేత జగన్‌ తెర తీసిన హైడ్రామాను కూటమి నేతలు దీటుగా ఎదుర్కొన్నారు. జగన్‌ తీరును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అరాచకాలపై టీడీపీ వేరుగా ఫిర్యాదు చేసింది. నకిలీ, రిలీవింగ్‌ పోలింగ్‌ ఏజెంట్లతో ఆర్వో ఆఫీసు ముందు జగన్‌ ధర్నా చేయించారని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో కూటమి నేతలు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌ చర్య సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ వర్ల రామయ్య మండిపడ్డారు. పులివెందులలో జగన్‌ జగన్మాటకం మరోసారి బట్టబయలైందని విమర్శించారు. అసలు ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లోనే ఉంటే నకిలీ ఏజెంట్లు ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు శ్రీనివాస రాజు మాట్లాడుతూ.. ఓటమి భయంతో పులివెందులలో, ముందే ప్లాన్‌ చేసుకొని జగన్‌ పెద్దడ్రామాకు తెరతీశారన్నారు. జనసేన సీనియర్‌ నాయకులు మారుతిరావు మాట్లాడుతూ.. ఇటువంటి చట్ట వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటేనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు మంచి సందేశం వెళ్తుందని అన్నారు. ఎన్నికల కమిషన్‌ను కలిసినవారిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌ బాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చి రాంప్రసాద్‌, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ ఉన్నారు.


వైసీపీపై చర్యలు తీసుకోండి: టీడీపీ

‘‘రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నాయి’ అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నెల్లిమర్ల, నిడదవోలు, చీరాల, పులివెందులలో చోటుచేసుకున్న ఐదు వేర్వేరు ఘటనలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్ల రామయ్య మాట్లాడుతూ, ‘పులివెందులలో జగన్‌ పిన్ని ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అందుకే పరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉంది. పక్కా ప్రణాళికతో జగన్‌ విధ్వంసాలు సృష్టిస్తున్నారు’ అని వర్ల రామయ్య ఆరోపించారు.

Updated Date - Nov 02 , 2026 | 06:49 AM