జిల్లా సారథులు వీరే
ABN , Publish Date - Nov 20 , 2026 | 02:34 AM
కూటమి పార్టీల మధ్య ‘జిల్లా పరిషత్’ల సర్దుబాటు పూర్తయింది. ఆ వెంటనే... 22 జిల్లాల సారథులు వీరే... అని టీడీపీ అధికారిక ప్రకటన చేసింది.
22 జడ్పీలకు అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ
విజయనగరం చిన్న శ్రీను కుమార్తెకే
పలు జిల్లాల్లో వారసులకు అవకాశం
జడ్పీ చైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ నేడే
టీడీపీ చైర్‌పర్సన్లలో బీసీలకు 6, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, మైనార్టీలకు 1, ఓసీలకు 9
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి పార్టీల మధ్య ‘జిల్లా పరిషత్’ల సర్దుబాటు పూర్తయింది. ఆ వెంటనే... 22 జిల్లాల సారథులు వీరే... అని టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. 4 జిల్లాలు జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కగా... ఆ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం... శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికల్లో గెలిచిన జడ్పీటీసీలు పరోక్ష పద్ధతిలో వీరిని ఎన్నుకుంటారు. గురువారం అర్ధరాత్రి వరకు కూటమి అగ్రనేతల నడుమ చర్చలు జరిగాయి. ఇది కొలిక్కి రాగానే... ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీకి దక్కిన 22 జడ్పీ చైర్‌పర్సన్, 20 వైస్ చైర్‌పర్సన్ పేర్లను ప్రకటించారు.
ఊహించినట్లుగానే విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్ పదవి మజ్జి సిరిసహస్రను వరించింది. ఈమె వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో విబేధించి టీడీపీలో చేరిన ఆయన మేనల్లుడు చిన్న శ్రీను కూతురు. సత్యసాయి జడ్పీ పదవికి పరిటాల రవి, సునీతల కుమారుడుశ్రీరామ్‌ను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీని ఏలూరు పీఠంపై కూర్చోబెట్టారు. అన్నమయ్య జడ్పీ సారథిగా సీనియర్ నేత పాలకొండ్రాయుడి కుమారుడు ప్రసాద్‌బాబుకు చాన్స్ దక్కింది..
బీసీలకు పెద్దపీట: జడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల కేటాయింపులో టీడీపీ బీసీలకు పెద్దపీట వేసింది. 6 చైర్ పర్సన్లను, 11 వైస్ చైర్‌పర్సన్లను ఆ వర్గాలకు కేటాయించింది. ఎస్సీలకు 5 చైర్ పర్సన్లు, 1 వైస్ చైర్‌పర్సన్... ఎస్టీ, మైనారిటీలకు ఒక్కో చైర్‌పర్సన్, రెండేసి వైస్ చైర్‌పర్సన్లు దక్కాయి. ఓసీలకు 9 చైర్ పర్సన్లను, 4 వైస్ చైర్‌పర్సన్లను కేటాయించారు. పొత్తులో దక్కిన 22 చైర్‌పర్సన్ స్థానాల్లో టీడీపీ 12 మహిళలకు కేటాయించింది. 20 వైస్ చైర్‌పర్సన్ స్థానాల్లో 11 మహిళలకు అవకాశం కల్పించింది. సామాజిక వర్గాల వారీగా.. బోయ, అగ్నికుల క్షత్రియ, గవర, గౌడ, కొప్పుల వెలమ, కురబ, నగరాలు, నాగవంశీ, శెట్టిబలిజ, తూర్పు కాపు, వాడ బలిజ, వన్యకులక్షత్రియ, యాదవులకు 17 పదవులు.. మాదిగలకు 4, మాలలకు 2 పదవులు దక్కాయి. ఓసీల్లో.. బలిజకు ఒకటి, కమ్మ రెడ్లకు 5 చొప్పున, కాపులకు 1, క్షత్రియులకు 1, ముస్లింలకు 3 కేటాయించారు.
టీడీపీ జడ్పీ ఉపాధ్యక్షులు వీరే..: శ్రీకాకుళం-గుంటు విజయ్‌కుమార్, విజయనగరం-పసల నీరజ, పార్వతీపురం మన్యం-వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్, విశాఖపట్నం-సుకవాసి అజయ్, అనకాపల్లి-పెంటకోట స్వాతి, కాకినాడ-పిల్లి అనంతలక్ష్మి, పశ్చిమ గోదావరి-సిరగాని నాగేశ్వరరావు, పోలవరం-తీగల ప్రభ, ఏలూరు-బొర్రా చలమయ్య, కృష్ణా-దండమూడి పూజిత, గుంటూరు-తల్లా అశోక్‌కుమార్, పల్నాడు-నల్లపాటి కీర్తన, మార్కాపురం-జీవీ శ్రీనివాసవర్మ, నెల్లూరు-పొట్టేళ్ల ప్రసాద్, కర్నూలు-షేక్ షాదిక, నంద్యాల-కె.శ్రీకాంత్‌రెడ్డి, అనంతపురం-వెన్నపూస లలిత, కడప-హబీబున్నీసా చాంద్‌బాయి, అన్నమయ్య-తలారి శరణ్, చిత్తూరు-మంజుప్రియ వెంకటేశ్.. కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి జడ్పీ ఉపాధ్యక్ష పదవులను జనసేనకు, ఎన్టీఆర్, తిరుపతి ఉపాధ్యక్ష స్థానాలను బీజేపీకి కేటాయించారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు.
కడపలో కూటమి హవా..
జిల్లాలో మొత్తం 39 ఎంపీపీ స్థానాలకు గాను 35 చోట్ల ఎన్నికలు జరిగాయి. 31 టీడీపీ ఖాతాలో పడ్డాయి. బీజేపీ 2, జనసేన, స్వతంత్ర అభ్యర్థి చెరోచోట గెలిచారు. నందలూరు ఎంపీపీగా స్వతంత్ర ఎంపీటీసీ ఎద్దుల ప్రమీల ఎన్నికయ్యారు. ఈమె భర్త ఎద్దుల సాగర్ నందలూరు-1 నుంచి ఎంపీటీసీగా టీడీపీ తరఫున గెలిచారు. బి.కోడూరు, సింహాద్రిపురం, వీరబల్లె ఎంపీపీ ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. అన్నమయ్య జిల్లాలో 25 ఎంపీపీలకు గాను 24చోట్ల ఎన్నికలు జరిగాయి. కూటమి 20, వైసీపీ 4 గెలుచుకున్నాయి. తంబళ్లపల్లె మండలం ములకలచెరువులో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాల్లో 11 కూటమి, 2 వైసీపీ గెలుచుకున్నాయి. రామసమద్రం మండలంలో వైసీపీ సభ్యుడొకరు గైర్హాజరు కావడంతో టీడీపీ ఎంపీపీ పదవిని దక్కించుకుంది. ఇక్కడ కూటమి, వైసీపీ చెరో 7 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ఎన్నికకు వైసీపీ తరఫున ఒక ఎంపీటీసీ సభ్యుడు గైర్హాజరు కావడంతో టీడీపీ అభ్యర్థి విజయకుమార్ గౌడ్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాలో 27 ఎంపీపీలకు గాను టీడీపీ 24 కైవసం చేసుకుంది. వైసీపీ మూడు ఎంపీపీ పదవులను దక్కించుకుంది. పది మండలాల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులను మహిళలే గెలుచుకోవడం విశేషం.
నంద్యాలలో టీడీపీ ఆధిపత్యం
జిల్లాలో 28 ఎంపీపీ స్థానాల్లో టీడీపీ 21, వైసీపీ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. టీడీపీలో వర్గపోరు కారణంగా ఉయ్యాలవాడ, పగిడ్యాల మండలాల్లో ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. పగిడ్యాల మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 9 స్థానాల్లో టీడీపీ, ఒకచోట వైసీపీ నెగ్గింది. ఇక్కడ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మధ్య వర్గ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. 9 మంది టీడీపీ ఎంపీటీసీల్లో ఐదుగురు ఎమ్మెల్యే వర్గంలో ఉండగా.. ఎంపీ శబరి వర్గంలో నలుగురు ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఒక ఎంపీటీసీ సైతం ఎంపీ వర్గంలో చేరిపోయారు. దీంతో రెండు వర్గాలకు చెరో ఐదు స్థానాల బలం ఉంది. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు వెంకటశివుడు యాదవ్ ఇరువర్గాలకు నచ్చే చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉయ్యాలవాడలో 8 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో టీడీపీ-5, జనసేన-1, వైసీపీ-2 చొప్పున గెలుపొందాయి. ఎంపీపీ పీఠంపై టీడీపీ రెండు వర్గాల నడుమ ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు.
అనంతలో టీడీపీ జోరు..
జిల్లాలో 31కి గాను 29 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుపగా.. 28 చోట్ల టీడీపీ నేతలు మండలాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నార్పల స్థానం వైసీపీకి దక్కింది. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో పామిడి, కళ్యాణదుర్గం ఎంపీపీల ఎన్నిక వాయిదా పడింది. వీటితోపాటు బెళుగుప్ప, కూడేరు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు ఉపాధ్యక్ష స్థానాల ఎన్నిక కూడా శుక్రవారం జరుగనుంది. సత్యసాయి జిల్లాలో 32 ఎంపీపీలకుగాను 31 స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. టీడీపీ 28, వైసీపీ 3 గెలుచుకున్నాయి. ముదిగుబ్బ మండలంలో టీడీపీ 8, బీజేపీ 3, వైసీపీ 6 ఎంపీటీసీ స్థానాల్లో గెలిచాయి. కూటమికి 11 స్థానాలు ఉన్నా.. అభ్యర్థుల ఎంపికపై ఏకాభ్రిపాయం కుదరలేదు. దీంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ
బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం