Share News

విజయ్‌ రాకతో బెజవాడ దద్దరిల్లింది!

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:38 AM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆగమనంతో విజయవాడ దద్దరిల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు.

విజయ్‌ రాకతో బెజవాడ దద్దరిల్లింది!

  • సీఎం అయ్యాక తొలిసారి ఇక్కడికే వచ్చారు

  • ఆయన్ను దుర్గమ్మే పిలిచింది: చంద్రబాబు

  • నదుల అనుసంధానంపై చర్చించేందుకే వచ్చా

  • నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందం: విజయ్‌

విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆగమనంతో విజయవాడ దద్దరిల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లి నివాసంలో భేటీ అనంతరం ఇద్దరు సీఎంలూ విజయవాడ పున్నమిఘాట్‌లో దసరా ఉత్సవ్‌ 2.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విజయ్‌ సీఎం అయ్యాక మొదటిసారి వేరే రాష్ట్రానికి వచ్చారని, అదీ విజయవాడేనని చెప్పారు. ఆయన్ను దుర్గమ్మ తల్లే పిలిచిందన్నారు. తమిళనాడును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విజయ్‌ పనిచేస్తున్నారని, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే సీఎం అయ్యారని ప్రశంసించారు. విజయవాడ ఉత్సవ్‌ను అదిరిపోయేటట్లు చేశారని ఆయన కితాబిచ్చారని.. హాజరైనందుకు ఆయనకు.. విజయవాడ ఉత్సవ్‌ 2.0 నిర్వాహకులు, కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు అందజేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాలు వేరైనా తమ అభిమతం ఒక్కటేనని.. దక్షిణాది రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేస్తే కలిసికట్టుగా అభివృద్ధి చెందవచ్చని అన్నారు. ‘యువతలో ఆధ్యాత్మికత భావన కలగాలంటే ఇటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు జరగాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏదైనా సాధ్యమవుతుంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరుగుతుంది. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులు కూడా కలిస్తే నాలుగు దక్షిణ రాష్ట్రాలూ బాగుపడతాయి’ అని వ్యాఖ్యానించారు.


తెలుగులో మాట్లాడిన విజయ్‌..

అనంతరం తమిళనాడు సీఎం తెలుగులో మాట్లాడి అభిమానులను ఉత్సాహపరిచారు. ‘నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా భావిస్తున్నాను. విజయవాడ ఉత్సవ్‌ 2.0కు రావడం, నవరాత్రి ఉత్సవంలో మీ అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నదుల అనుసంధానం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు వచ్చాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు’ అంటూ విజయ్‌ కుప్తంగా ముగించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:38 AM