కనకదుర్గమ్మ సన్నిధిలో విజయ్
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:25 AM
: తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. తొలుత చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
గన్నవరం నుంచి నేరుగా వచ్చి అమ్మవారినిదర్శించుకున్న తమిళనాడు సీఎం
పూర్ణకుంభంతో అర్చకుల స్వాగతం
వేదాశీర్వచనం, ప్రసాదం అందజేత
విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. తొలుత చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఆలయం వద్ద విజయ్కు ఎంపీ కేశినేని చిన్ని, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ స్వాగతం పలికారు. రాజగోపురం వద్దకు చేరుకోగానే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు.
ప్రధానాలయంలో విజయ్ తన పేరు, జన్మనక్షత్రం చెప్పి పూజ చేయించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పండితులు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేవారు. సాధారణంగా ప్రముఖులకు ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు పీట వేస్తారు. అయితే విజయ్ దానిని పక్కన పెట్టి నేలపై కూర్చున్నారు. స్థానాచార్య శివప్రసాద్శర్మ, ఆలయ ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్ వేదాశీర్వచనం ఇచ్చారు. నుదుట బొట్టు పెట్టి, అక్షింతలు వేశారు. అమ్మవారి శేషవస్త్రాన్ని మెడలో వేస్తారు. అయితే విజయ్ చేత్తో తీసుకున్నారు.
ఆశీర్వచనానికి ముందు మెడలో పూలదండ వేయడం ఆనవాయితీ. అయితే భద్రతా సిబ్బంది సూచనల మేరకు వేదపండితులు ఆయనకు దండ వేయలేదు. విజయ్ వెంట తమిళనాడు ఆధవ్ అర్జున, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. ఆయన కాన్వాయ్ దిగి ఆలయంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు.. క్యూలలో ఉన్న భక్తులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఆయన అభివాదం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత