Share News

నేడు అమరావతికి విజయ్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:01 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు తమిళనాడు సీఎం సి.జోసెఫ్‌ విజయ్‌ మంగళవారం అమరావతి రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు

నేడు అమరావతికి విజయ్‌

  • తొలుత కనకదుర్గ అమ్మవారి దర్శనం

  • తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి

  • నదుల అనుసంధానం, చెన్నైకు తాగునీటి

  • సరఫరాపై తమిళనాడు సీఎం చర్చలు

  • అనంతరం ‘విజయవాడ ఉత్సవ్‌ 2.0’కు

  • అక్కడే డిప్యూటీ సీఎం పవన్‌తోనూ భేటీ

అమరావతి, చెన్నై, విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు తమిళనాడు సీఎం సి.జోసెఫ్‌ విజయ్‌ మంగళవారం అమరావతి రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అమ్మవారి దర్శనానంతరం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ గంట పాటు చంద్రబాబుతో విజయ్‌ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు గంగ పథకం కింద నెల్లూరు జిల్లా కండలేరు డ్యామ్‌ నుంచి చెన్నైకి ఇవ్వాల్సిన కృష్ణా జలాలు, దక్షిణ భారతదేశంలోని గోదావరి-కృష్ణా-కావేరి నదుల అనుసంధానం గురించి ఆయన చర్చించనున్నారు.

రాష్ట్ర విభజన జరిగాక తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వంతో నదీ జలాల అంశంపై ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నది. ఈ భేటీ తరువాత అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు పున్నమి ఘాట్‌లోని ఉత్సవ్‌ గ్రౌండ్‌కు విజయ్‌ చేరుకుంటారు. ‘విజయవాడ ఉత్సవ్‌ 2.0’లో కళా ప్రదర్శనలు వీక్షించి ప్రసంగిస్తారు. అక్కడే ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కూడా విజయ్‌ కలుసుకుంటారని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం అనంతరం 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని చెన్నై పయనమవుతారు. ఇప్పుడు రెండోసారి భేటీ కానున్నారు. విజయ్‌ తమిళనాడు సీఎం అయ్యాక ఏపీకి రానుండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:01 AM