Share News

స్వర హోటల్స్‌కు కేటాయించిన భూమి వివరాలు పరిశీలిస్తాం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:18 AM

టీటీడీకి చెందిన భూమిని ఒబెరాయ్‌ గ్రూప్‌నకు చెందిన స్వర హోటల్స్‌ లిమిటెడ్‌కు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

స్వర హోటల్స్‌కు కేటాయించిన భూమి వివరాలు పరిశీలిస్తాం

  • ఈ నిర్ణయం వ్యాపారంగా ఉంది

  • వైసీపీ నేత భూమన పిటిషన్‌పై టీటీడీకి

  • హైకోర్టు ధర్మాసనం ఆదేశం

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): టీటీడీకి చెందిన భూమిని ఒబెరాయ్‌ గ్రూప్‌నకు చెందిన స్వర హోటల్స్‌ లిమిటెడ్‌కు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రాథమికంగా ఈ నిర్ణయం వ్యాపారపరమైనదిగా కనపడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూకేటాయింపులకు సంబంధించి విధివిధానాలను తాము పరిశీలించాలని అనుకుంటున్నామని పేర్కొంది. ఈ వ్యవహారంపై స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది. పిల్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

తిరుపతి అర్బన్‌ మండలం, ఆర్‌.ఎస్‌. గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 588(ఏ4)లో టీటీడీకి చెందిన 20 ఎకరాలను పర్యాటకశాఖకు బదలాయించడం, తదనంతరం వాటిని స్వర హోటల్స్‌కు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి హైకోర్టులో సవాల్‌ చేశారు. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని టీటీడీకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రాయప్రోలు శ్రీకాంత్‌ వాదనలు వినిపించారు.


టీటీడీకి చెందిన రూ.400 కోట్ల విలువ చేసే భూమిని పర్యాటకశాఖకు కేటాయించారన్నారు. దీనికి బదులుగా ఆ శాఖ నుంచి రూ.20 కోట్లు విలువ చేసే భూమిని టీటీడీ తీసుకుందన్నారు. టీటీడీ నుంచి తీసుకున్న భూమిని స్వర హోటల్‌ నిర్మాణం కోసం కేటాయించారని తెలిపారు. భూమి విషయంలో యథాతథ స్థితి పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టీటీడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అలిపిరి వద్ద బేస్‌ క్యాంప్‌ నిర్మించాలని టీటీడీ మొదట నిర్ణయించినప్పటికీ సాంకేతికంగా సాధ్యం కాలేదని, లీజు విధానంలోనే భూమిని కేటాయిస్తున్నారని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:23 AM