తుది తీర్పునకు లోబడే విలీనం!
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:03 AM
ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర మున్సిపల్ సవరణ చట్టం-2021 రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తామని వెల్లడించింది.
మున్సిపాలిటీల్లో గ్రామాలను కలపడంపై సుప్రీంకోర్టు వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు.. తుది విచారణ నవంబరు 17న
న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర మున్సిపల్ సవరణ చట్టం-2021 రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తామని వెల్లడించింది. పలు గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనం చేయడంపై దాఖలైన పిటిషన్లపై రాష్ట్రప్రభుత్వానికి నోటీసు లు జారీచేసింది. తుది విచారణను నవంబ రు 17కి వాయిదా వేసింది. ప్రధానంగా.. పొన్నూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కందుకూరు, భీమవరం, గూడూరు, గుడివా డ మున్సిపాలిటీలతోపాటు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, రాజానగరం అప్గ్రేడ్(మున్సిపాలిటీగా) పరిధిలోని గ్రామాల విలీనానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆ పిటిష న్లు బుధవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది జి.రామకృష్ణ ప్రసాద్ వాదన లు వినిపించారు. విలీన ప్రక్రియలో పంచాయతీల అభిప్రాయ సేకరణ, నోటీసుల జారీ విధానానికి సంబంధించి ఉన్న చట్టపరమైన అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్రావు, వెంకట రఘువంశీ.. రాజమహేంద్రవరం గ్రామాల తరఫున న్యాయవాది రమేశ్ అల్లంకి తమ అభిప్రాయాలను నివేదించారు.
గ్రామీణ ప్రాంతాలను పట్టణ సంస్థలుగా మార్చే క్రమంలో జనసాంద్రత, స్థానిక ఆదాయం, వ్యవసాయేతర ఉపాధి వంటి సామాజిక-ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని ‘చంపాలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న నిబంధనలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సదరు చట్ట సవరణలు, విలీన ప్రక్రియ ప్రాధాన్యాన్ని కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం నవంబరు 17న తుది విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..