Share News

కసిరెడ్డిపై పిటిషన్‌ విచారణ 27కు వాయిదా

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:40 AM

మద్యం పాలసీ, రవాణా కేసులో నిందితులు రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 27న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

కసిరెడ్డిపై పిటిషన్‌ విచారణ 27కు వాయిదా

  • సుప్రీంలో ఏపీ సర్కారు దాఖలు

న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం పాలసీ, రవాణా కేసులో నిందితులు రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 27న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 2019-2024 మధ్య కాలంలో ఏపీలో జరిగిన ఎక్సైజ్‌ పాలసీ మార్పులు, మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ 2024లో కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఇదే వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఐడీ అధికారులు మరో కొత్త కేసు నమోదు చేశారు. ఈ రెండో కేసులో కసిరెడ్డి ఇప్పటికే వేరే జైలులో ఉండగా, పోలీసులు పీటీ వారెంట్‌ ద్వారా అతడ్ని జూలై 20న కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తీసుకున్నారు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నామనే కారణాలను పోలీసులు రాతపూర్వకంగా తనకు ఇవ్వలేదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1), సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం చట్టవిరుద్ధమని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

హైకోర్టు ఈ కేసులోని ఇతర అంశాల జోలికిపోకుండా, కేవలం అరెస్టు చేసేటప్పుడు రాతపూర్వకంగా కారణాలు చెప్పాలనే నిబంధన మీద దృష్టి పెట్టింది. నిందితుడిని అరెస్టు చేసేటప్పుడు రాతపూర్వకంగా గ్రౌండ్స్‌ ఇవ్వడం తప్పనిసరని అభిప్రాయపడింది. పోలీసులు ఆ రూల్‌ పాటించకపోతే అరెస్టు చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం ఆగస్టు 22న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. గురువారం ఆ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే సీనియర్‌ న్యాయవాది అందుబాటులో లేరని, విచారణను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ధర్మాసనం దీన్ని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:40 AM