Share News

అనంతబాబుకు సుప్రీంలో షాక్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:29 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్‌ ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ట్రయల్‌ కోర్టులో విచారణ గడువు పెంచాలని కోరుతూ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

 అనంతబాబుకు సుప్రీంలో షాక్‌

  • దళిత డ్రైవర్‌ హత్య కేసులో బెయిల్‌ ఇవ్వడానికి సీజేఐ బెంచ్‌ నిరాకరణ

  • విచారణ తుది దశలో ఇవ్వలేమని స్పష్టీకరణ

  • ఆయన భార్య లక్ష్మీ దుర్గకూ తప్పని నిరాశ

  • విచారణ గడువు పెంపునకు నో

న్యూఢిల్లీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్‌ ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ట్రయల్‌ కోర్టులో విచారణ గడువు పెంచాలని కోరుతూ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య, డోర్‌ డెలివరీపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. బాధిత కుటుంబం, ప్రజాసంఘాలు ఆందోళన చేయటం, పోస్టుమార్టం నివేదికలో శరీరంపై 31, అంతర్గతంగా మూడు గాయాలున్నట్లు తేలటంతో నాడు పోలీసులు, తప్పనిసరై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. 2022 మే 19న ఘటన జరగ్గా నిందితుడు అనంతబాబును 4రోజుల తర్వాత అరెస్టు చేశారు. గతంలో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, ఈ ఏడాది నవంబరు 30 వరకు విచారణ పూర్తిచేయాలని గడువు విధించింది. ఈక్రమంలో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అనంతబాబు, కేసు గడువు విచారణ తేదీని పొడిగించాలంటూ ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్‌ రోజా సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి బుధవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వీ.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరయ్యారు.


నేరుగా సుప్రీంకోర్టుకు రావడమేంటి?

ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లాలిగానీ, నేరుగా సుప్రీంకోర్టుకు రావడం ఏమిటని విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్‌ కోర్టులో విచారణ వేగంగా జరుగుతోందని లూథ్రా తెలిపారు. ఈక్రమంలో విచారణ గడువును పొడిగించమని అడగడం సమంజసం కాదన్నారు. ట్రయల్‌ కోర్టులో కేసు విచారణ పురోగతిని ధర్మాసనం అడిగి తెలుసుకుంది. తమ ముందస్తు ఆదేశాల మేరకు ట్రయల్‌ కోర్టు రోజువారీ విచారణ చేస్తోందని గుర్తుచేసింది. ‘‘ఇప్పటికే 39 మంది సాక్షుల విచారణ పూర్తయింది. కొద్దిమందిది మాత్రమే మిగిలిఉంది. విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 21 కింద బెయిల్‌ ఇవ్వమని కోరడం తొందరపాటు చర్యే అవుతుంది. అదికూడా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిండమేంటి?’’ అని ప్రశ్నించింది. హైకోర్టుకు వెళితే సబబుగా ఉంటుందని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పించాలని అనంతబాబు తరఫున మేనకా గురుస్వామి కోరగా, ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

ట్రయల్‌ కోర్టు జడ్జి కోరితే ఆలోచిస్తాం..

ఈఏడాది నవంబరు 2026న కేసు విచారణను ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించిందని, అయితే ఆ గడువును పొడిగించాలని అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. గడువు పెంపు కోసం మీరెందుకు అంత ఆత్రపడుతున్నారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం విచారణ పూర్తి కాదని భావిస్తే, ట్రయల్‌ కోర్టే సమయం కావాలని దరఖాస్తు చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. అలా, ట్రయల్‌ కోర్టు జడ్జి ఏమైనా లేఖ రాస్తే ఆలోచిస్తామని తెలిపింది. ఈ దశలో గడువు పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించలేమని తేల్చి చెప్పింది. లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్‌(ఏ.ఐ.)ను డిస్మిస్‌ చేసింది.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:29 AM