Share News

వివేకా హత్యతో లబ్ధి వీరికే!

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:11 AM

‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో ఎవరు లాభపడ్డారో.. లబ్ధి పొందారో పులివెందులలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. జగన్‌, ఆయన భార్య భారతి, భాస్కర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి లబ్ధి పొందారు.

వివేకా హత్యతో లబ్ధి వీరికే!

  • జగన్‌, భారతి, భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌, శివశంకర్‌ రెడ్డిలను ఉరితీయాలి

  • ఏ తప్పూ చేయలేదంటున్న వాళ్లు విచారణ ఎందుకు కోరడం లేదో వారే చెప్పాలి

  • కన్న తండ్రిని చంపించాల్సిన అవసరం సునీతకు లేదు... అల్లుడికి కూడా లేదు

  • నేను బతికి ఉంటేనే కేసు నిలుస్తుంది

  • నాకు రక్షణ కల్పించాలి: సునీల్‌ యాదవ్‌

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో ఎవరు లాభపడ్డారో.. లబ్ధి పొందారో పులివెందులలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. జగన్‌, ఆయన భార్య భారతి, భాస్కర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి లబ్ధి పొందారు. వారికి ఉరిశిక్ష విధించాలి. ఏ తప్పూ చేయలేదంటున్న వాళ్లందరూ విచారణ ఎందుకు కోరడం లేదు.’’ అని వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారన్న నేపథ్యంలో సదరు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారుల ముందు సునీల్‌ ఇటీవల హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు బయట పెట్టారు. వివేకానందరెడ్డి బతికి ఉంటే కచ్చితంగా కడప ఎంపీ అయ్యేవారని, ఆయన్ను చంపేస్తే ఎవరికి లబ్ధి కలుగుతుందో వారే అంతమొందించారని అన్నారు. ‘‘వివేకా హత్య కేసులో నేను ఏ తప్పూ చేయలేదు. ఆయన బతికి ఉంటే నన్ను యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ చేసేవారు. ఆయన హత్యలో నా తప్పులేదు. నేను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా. నేను బతికి ఉంటేనే కేసు నిలుస్తుంది. అసలు లబ్ధిదారులకు శిక్ష పడుతుంది. నాకు రక్షణ కల్పించాలి.’’ అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ దర్యాప్తులో తన పాత్ర తేలలేదని, తాను ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ప్రాణ భయంతో అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా బిక్కు బిక్కు మంటూ బతుకున్నానని వాపోయారు.


వివేకా హత్య కేసులో సాక్షుల మాదిరిగా తాను దోమలు కుడితేనో, ఎలుకలు కొరికితేనో చనిపోయే రకం కాదన్నారు. కన్న తండ్రిని చంపించుకోవాల్సిన అవసరం సునీతకు లేదని, ఆమె భర్త రాజశేఖర్‌ రెడ్డి పాత్ర కూడా ఇందులో లేదని చెప్పారు. ‘‘ఎవరు చేశారో, ఎందుకు చేశారో నేను బతికుంటే మొత్తం చేబుతా. కేసు బతకాలంటే నాకు రక్షణ కల్పించాలి.’’ అని సునీల్‌ యాదవ్‌ వేడుకున్నారు. ఏపీ హోం మంత్రి అప్పాయింట్‌మెంటు ఇస్తే.. ఆమెను కలిసి మరిన్ని విషయాలు చెబుతానని చెప్పారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 04:12 AM