శ్రీశైలంలో అనూహ్యంగా అడుగంటిన నీరు
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:24 AM
విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ యథేచ్ఛగా నీరు తోడేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో డ్యాంలో నీటి నిల్వ అనూహ్యంగా 90.98 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొంది.
యథేచ్ఛగా తెలంగాణ విద్యుదుత్పత్తి
మిగిలిన 90 టీఎంసీలు తాగునీటికే..
కృష్ణా బోర్డుకు ఏపీ స్పష్టీకరణ
66:34 నిష్పత్తిలోనే పంపిణీ చేయాలి
ఈ ఏడాది మేం 84 టీఎంసీలు వాడాం
తెలంగాణ వినియోగం 66 టీఎంసీలు
కేఆర్‌ఎంబీ హెడ్ క్వార్టర్స్‌ను
అమరావతి/విజయవాడకు మార్చాలి
ప్రాజెక్టుల అప్పగింతకు మేం రెడీ
జలవనరుల ప్రత్యేక సీఎస్ లేఖ
ఎల్లుండి కేఆర్‌ఎంబీ సర్వసభ్య భేటీ
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ యథేచ్ఛగా నీరు తోడేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో డ్యాంలో నీటి నిల్వ అనూహ్యంగా 90.98 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొంది. ఇక మిగిలిన నీటిని తాగునీటి అవసరాల కోసమే వాడుకోవలసి ఉందని తెలిపింది. 66:34 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణకు ఈ నీటిని పంచాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి స్పష్టం చేసింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇటీవల లేఖ రాశారు. వచ్చేనెల 1న కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రం తరఫున అజెండా అంశాలను పంపించారు. ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను ఏపీ సుమారు 84 టీఎంసీలు, తెలంగాణ 66.4 టీఎంసీలను వాడుకున్నాయని లేఖలో గణాంకాలతో వివరించారు.
కృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులను విభజన చట్టం ప్రకారం బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమేనన్నారు. విభజన చట్టం ప్రకారం ఏర్పడిన కేఆర్‌ఎంబీ.. నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తన ప్రధాన కార్యాలయాన్ని అమరావతి/విజయవాడకు మార్చాలని డిమాండ్ చేశారు. సుంకిశాల నుంచి ఎలాంటి అధీకృత ఆదేశాలు లేకుండా తెలంగాణ ఇన్‌టేక్ వెల్స్ నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 90 టీఎంసీలను, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 25 టీఎంసీలకు అదనంగా మరో 15 టీఎంసీలు.. అంటే 40 టీఎంసీలను వాడుకుంటోందని ఫిర్యాదు చేశారు. నెట్టెంపాడు లిఫ్టు కింద 2.3 టీఎంసీల సామర్థ్యంతో రేలంపాడు రిజర్వాయరును ప్లాన్ చేయగా.. దానిని 10 టీఎంసీలకు పెంచడంపైనా అభ్యంతరం తెలిపారు. గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు సామర్థ్యాన్ని అదనంగా మరో 15 టీఎంసీలకు పెంచడాన్నీ ఆక్షేపించారు. అచ్చంపేట ఎత్తిపోతల ద్వారా రూ.1534 కోట్లతో 57,200 ఎకరాలకు సాగునీరందించేలా 2.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోందని, మధిరలోని వైరా నదిపై అనుమతుల్లేకుండా ఎత్తిపోతల చేపడుతోందని తెలిపారు.
12 రోజుల్లో 21 టీఎంసీల వాడకం
శ్రీశైలం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యుదుత్పత్తి పేరిట తెలంగాణ శ్రీశైలం డ్యాం నుంచి సోమవారం కూడా 42,378 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసింది. ప్రస్తుతం డ్యాంలో నీటినిల్వ 854.70 అడుగులకు చేరింది. 12 రోజులుగా సుమారు 21 టీఎంసీలను వినియోగించగా.. ఇందులో అత్యధికం తెలంగాణ విద్యుదుత్పత్తికే వినియోగించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సుంకేసుల నుంచి 2,248 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రానికి శ్రీశైలంలోకి చుక్కనీరు కూడా చేరలేదు. హంద్రీ-నీవాకు 3,800 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 3వేల క్యూసెక్కులు, వెలిగొండ ప్రాజెక్టుకు 500 క్యూసెక్కులు విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..