శ్రీశైలం డ్యాంకు ప్రపంచ గుర్తింపు!
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:12 AM
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు(లండన్)లో స్థానం దక్కించుకున్న తొలి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. శ్రీశైలంలో సోమవారం జరిగే కార్యక్రమంలో..
‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
నేడు ధ్రువపత్రం అందజేయనున్న సంస్థ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ
దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి ప్రాజెక్టు
కర్నూలు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు(లండన్)లో స్థానం దక్కించుకున్న తొలి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. శ్రీశైలంలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఆ సంస్థ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ యు.ఇలియాజర్ సంబంధిత సర్టిఫికెట్‌ను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా, శ్రీశైలం డ్యాం ఎస్‌ఈ వేణుగోపాల్‌కు అందజేయనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్స్డు’లో స్థానం కల్పించాలని జలవనరుల శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా నేతృత్వంలో ఇంజనీర్లు దరఖాస్తు చేశారు.
దీంతో ఇలియాజర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసింది. దక్షిణాసియాలో ఏ ప్రాజెక్టుకు లేనివిధంగా 60 అడుగులు వెడల్పు, 55 అడుగులు ఎత్తులో క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేయడం ఈ డ్యాం ప్రత్యేకత. భూమండలంలోనే అత్యంత ఎత్తులో (సముద్ర మట్టానికి 980 అడుగుల ఎత్తులో) దీన్ని నిర్మించారు. 2009 అక్టోబరు 2న రికార్డు స్థాయిలో 25.4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డ్యాం చెక్కు చెదరకుండా పటిష్ఠంగా ఉంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు గుర్తించిన బృందం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్స్డు’లో నమోదు చేయవచ్చని లండన్‌కు నివేదిక పంపింది. దాన్ని పరిశీలించిన అనంతరం డబ్ల్యూబీఆర్‌లో నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్