శ్రీగిరిపై వైభవంగా దసరా ఉత్సవాలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:48 AM
నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రామరి
భృంగి వాహనంపై విహరించిన ఆది దంపతులు
శ్రీశైలం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి అర్చక వేదపండితులతో స్మార్థ ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్ల యాగశాలలో అఖండ దీపస్థాపన, కలశస్థాపన, జపపారాయణలు, హోమాలు, విశేష పూజలతో పాటు తొలిసారి సహస్ర చండీపారాయణ సహిత శత చండీ మహా రుద్రయాగ కార్యక్రమాలు నిర్వహించారు.
లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహాసంకల్పాన్ని పఠించారు. భ్రమరాంబికాదేవి తొలిరోజు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. ద్విభుజాలు కలిగిన శైలపుత్రి ఎడమ చేతిలో పద్మాన్ని, కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉండటం ఈ అలంకారం విశేషం. అనంతరం శైలపుత్రి సహిత మల్లికార్జున స్వామి భృంగి వాహనంపై కొలువుతీరగా గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో రెండోరోజు భ్రమరాంబ అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్