Share News

సౌర విద్యుత్‌లో సదరన్‌ డిస్కం రికార్డ్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:46 AM

దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) ఎస్సీ, ఎస్టీ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటులో కీలక మైలురాయిని చేరుకుంది. లక్షకుపైగా సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానించి..

సౌర విద్యుత్‌లో సదరన్‌ డిస్కం రికార్డ్‌

  • ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో సౌర వెలుగులు

  • లక్ష ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు

అమరావతి/తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) ఎస్సీ, ఎస్టీ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటులో కీలక మైలురాయిని చేరుకుంది. లక్షకుపైగా సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానించి.. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి డిస్కంగా ఘనత సాధించింది. వారు కూడా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు కావడం గమనార్హం. దీంతో దేశంలోని టాప్‌ -3 డిస్కంలలో ఒకటిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వారి గృహాలపై ఉచితంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 415 మెగావాట్ల సామర్థ్యంతో 2.07 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ లక్ష కనెక్షన్లను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎస్పీడీసీఎల్‌ తన సత్తా చాటింది. ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్‌ ప్రక్రియలో ఎస్పీడీసీఎల్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని సీఎండీ లోతేటి శివశంకర్‌ తెలిపారు. కేవలం 6 నెలల కాలంలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారుల ఇళ్లపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ వ్యవస్థలను ఎస్పీడీసీఎల్‌ ఏర్పాటు చేయడం విశేషం.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 04:46 AM