Share News

పేదలకు 52 వేల కోట్ల ఆస్తి

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:37 AM

ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా అమరావతిని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అమరావతే వారి అంతు చూస్తుందని ఆయన హెచ్చరించారు.

పేదలకు 52 వేల కోట్ల ఆస్తి

  • 60 వేల మందికి పట్టాల క్రమబద్ధీకరణ

  • ఇక మీకంటూ సొంత ఇల్లు.. అమ్ముకోవద్దు..

  • సెక్యూరిటీగా ఉంచి పరిశ్రమలు పెట్టుకోండి

  • అమరావతిని అడ్డుకుంటే అంతే

  • గొడ్డలి పార్టీది విధ్వంసం.. మాది అభివృద్ధి, సంక్షేమం

  • గోదావరి పుష్కరాలకు పుష్కలంగా నీరు

  • రానున్న రోజుల్లో కరువు కనిపించదు

  • కృష్ణా డెల్టా, సీమను సస్యశ్యామలం చేస్తాం

  • బెజవాడ-గుంటూరు-అమరావతి అన్‌స్టాపబుల్‌

  • మమ్మల్ని ఆశీర్వదించండి.. మిమ్మల్ని చూసుకుంటాం

  • విజయవాడ పేదల పట్టాభిషేకంలో సీఎం వ్యాఖ్యలు

‘‘రాబోయే 20 ఏళ్లు స్వర్ణాంధ్రకు కీలక మెట్టు. రాష్ట్రంలో నేను, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాం. 2019-24 మధ్య రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో మీకు తెలుసు. మేము మీకు మంచి చేస్తున్నాం. మా ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. మీ నుంచి ఇంకా అభిమానం పెరగాలి. అది ఓటు రూపేణా రావాలి. గొడ్డలి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి సమాధి చేయాలి.’’

- సీఎం చంద్రబాబు

విజయవాడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా అమరావతిని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అమరావతే వారి అంతు చూస్తుందని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 26 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం బుధవారం విజయవాడ ఎంబీపీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా పేదలకు క్రమబద్ధీకరించిన ఇళ్ల పట్టాల ద్వారా రూ.52 వేల కోట్ల ఆస్తిని అందించాం. దశాబ్దాలుగా ఇల్లు ఉన్నా సొంతం అని చెప్పుకోవటానికి లేదు. మీ బాధను, అభద్రతా భావాన్ని చూసి రాష్ట్రంలో 60 వేల మందికి పట్టాలు అందించాం.’’ అని చంద్రబాబు తెలిపారు. పుష్కరాల నాటికి కృష్ణా, గోదావరి నీటిని పుష్కలంగా తీసుకొస్తామన్నారు. రానున్న రోజుల్లో కరువు అనేది కనిపించకుండా కృష్ణాడెల్టా, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలుగా మహిళలు సత్తా చాటుతున్నారని, విశాఖపట్నం, విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో విజయవాడ-అమరావతి-గుంటూరు.. అన్‌స్టాపబుల్‌ సిటీగా మారిపోతుందని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


పేదల ఆనందమే నిజమైన అభివృద్ధి

‘‘విధ్వంసానికి గురైన రాష్ర్టాన్ని గాడిన పెట్టాం. ఆశీర్వదించండి. మా గెలుపు మీ బాధ్యత. మీ బాధ్యత మాది. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేశాం. మిత్రుడు పవన్‌ కల్యాణ్‌, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. విశాఖపట్నంలో 28 వేలు, మంగళగిరిలో 5,800, విజయవాడలో 26 వేల మందికి.. ఇలా మొత్తం 60 వేల మందికి క్రమబద్ధీకరణ చేసిన పట్టాలిచ్చాం. ఒక లబ్ధిదారుడికి సగటున 130 చదరపు గజాల స్థలం ఇచ్చాం. దీని విలువ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. కొంతమందికి రూ.2 కోట్లు కూడా విలువ చేస్తుంది. లబ్ధిదారుల సంతోషం చూస్తుంటే.. అన్ని పండుగలు ఒకేసారి జరుపుకొంటున్నట్టుగా ఉంది. పేదలంతా ఆనందంగా ఉంటే అదే నిజమైన అభివృద్ధి. ఇది ఎన్డీఏ సిద్ధాంతం. విశాఖపట్నం, మంగళగిరి, వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, కైకలూరు, అమలాపురం తదితర చోట్ల 120 సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపాం.’’


పట్టాలు అమ్ముకోవద్దు..

‘‘గత వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేసింది. పట్టాదారు పాసు పుస్తకాలపై వాళ్ల బొమ్మలేసుకున్నారు. ఇప్పుడు మేం ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్రతో ఇస్తున్నాం. ఒక్క రూపాయి తీసుకోకుండా క్రమబద్ధీకరిస్తున్న ఇంటి పట్టాలను అమ్ముకోవద్దు. అవసరమైతే వాటిని సెక్యూరిటీగా పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుని పైకి రండి. సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాయలసీమకు జీవనాడి లాంటి హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశాం. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేసి నల్లమల సాగర్‌కు ఏడు టీఎంసీల నీటిని తీసుకొచ్చాం. పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తీసుకెళ్లాం. రాయలసీమను ప్రపంచంలోనే హార్టీ కల్చర్‌ హబ్‌ గా చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. గోదావరి నీళ్లు 3 వేల నుంచి 5 వేల టీఎంసీలు సముద్రం పాలవుతోంది. మార్చి నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. ఆ తర్వాత పోలవరం కుడికాల్వ ద్వారా విజయవాడకు ప్రతిరోజూ 2 టీఎంసీల నీటిని అందిస్తా. ఇక కరువు అనే మాట లేదు. నాకల గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేయటం. ఇది జరిగితే దక్షిణ రాష్ర్టాలకు నీటి కొరతే ఉండదు. ఇంటికొకరు పారిశ్రామికవేత్త కావాలన్నది నా ఆకాంక్ష. పేదలందరికీ ఇళ్లు కల్పించే బాధ్యత తీసుకున్నాం. 5.50లక్షల మందికి ఇళ్లు పూర్తిచేసి ఇచ్చాం. మరో 5.50 లక్షల ఇళ్లు పూర్తిచేసి ఇస్తాం. మరో 3 లక్షల ఇళ్లకు ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తాం.’’

రాక్షసులను తరిమికొట్టాలి

‘‘పూర్వం రుషులు యజ్ఞాలు, రాజులు యాగాలు చేసినపుడు రాక్షసులు వచ్చి అడ్డుకునేవారు. గొడ్డలి పార్టీ కూడా అదే చేస్తోంది. కూటమి వచ్చాక విజయవాడ-గుంటూరు నగరాల మధ్య భూముల విలువలు పెరిగాయి. రేపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వస్తుంది. తర్వాత అవుటర్‌ రింగ్‌రోడ్డు వస్తుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఫోర్‌ లైన్‌ రైల్వే లైన్లు వస్తాయి. ఇవన్నీ వస్తే అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు ఒక్కటైపోయి అన్‌స్టాపబుల్‌ సిటీ అయిపోతుంది.’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘ప్రభుత్వం మీకు చేసిన మంచిని మీరుగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయండి. ఒక్కో లబ్ధిదారు పెడితే 26 వేల టెస్టిమోనియల్స్‌తో సోషల్‌ మీడియా షేక్‌ అవుతుంది. పేటీఎం బ్యాచ్‌ పత్తా లేకుండా పోతుంది.’’ అని చంద్రబాబు అన్నారు.


వంద కౌంటర్లలో పత్రాలు పంపిణీ

పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు విజయవాడ ఎంబీపీ స్టేడియంలో 100 కౌంటర్ల ద్వారా హక్కు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. సీఎం సభ పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు ఈ పత్రాలు జారీ చేశారు. సాయంత్రం నాటిని 20వేల పత్రాలు హక్కుదారులకు అందించినట్లు ఎన్టీఆర్‌ జిల్లా అధికారులు ప్రకటించారు. మిగిలిన వారికి సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాయాల్లో అందిస్తామని వెల్లడించారు.

పేలిన సోడాలు నింపే సిలిండర్‌

సీఎం చంద్రబాబు బహిరంగ సభ జరిగిన ప్రాంగణానికి అతికొద్ది దూరంలో సోడాల్లో గ్యాస్‌ నింపే సిలిండర్‌ పేలడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎంబీపీ స్టేడియానికి 60 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలు, పోలీసులు కంగారుపడ్డారు. సిలిండర్‌ పేలిన ప్రాంగణానికి పోలీసులు పరుగులు పెట్టారు. తొలుత వంటగ్యాస్‌ సిలిండర్‌ అని పోలీసులు భావించారు. తీరా సోడాల్లో గ్యాస్‌ నింపే సిలిండర్‌ అని క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తేల్చారు.

చీకటి చట్టాలతో ప్రజల ఆస్తులు కాజేశారు: మంత్రి సత్యకుమార్‌

గత వైసీపీ ప్రభుత్వం చీకటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కాజేసిందని మంత్రి సత్యకుమార్‌ మండిపడ్డారు. పేదల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం శాశ్వత ఆస్తి హక్కు పత్రాలను అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అనే చీకటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ, ప్రైవేటు, ఆయకట్టు, ఇనాం భూములను ఆక్రమించేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. 82 చదరపు గజాల స్థలానికి శాశ్వత హక్కు లభించబోతోందని తనతో మాట్లాడిన ఓ లబ్ధిదారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ఆమె స్థలం ప్రస్తుత విలువ రూ.32 లక్షలు ఉండగా, రిజిస్ర్టేషన్‌ తర్వాత దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుందని ఆనందం వ్యక్తం చేసినట్టు చెప్పారు.


లోకేశ్‌ సంకల్పం ఇది: మంత్రి అనగాని

పేదల సంక్షేమం, ఆస్తి భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా చేపట్టిన రీసర్వేలు, భూ వివాదాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు శాశ్వత భూహక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టాలు అందించాలన్న సంకల్పంతో మంత్రి లోకేశ్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు.

ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు: మంత్రి మనోహర్‌

విజయవాడలో 26,401 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో లబ్ధిదారుల ముఖాల్లో ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. కొండప్రాంతాల్లో దశాబ్దాలుగా జీవిస్తున్న పేదలకు పట్టాల ద్వారా తమ ఆస్తిపై శాశ్వత హక్కుతో పాటు భద్రత, భరోసా లభిస్తుందని తెలిపారు. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు అవసరాలు, బ్యాంకు రుణాల వంటి కీలక సందర్భాల్లో ఈ పట్టాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.


30 ఏళ్ల కల సాకారమైంది

‘‘2001లో నా భర్త చనిపోతే, ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పెంచాను. 30 ఏళ్లుగా నివాసముంటున్నా రాని పట్టాను నేడు ప్రభుత్వం ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేసి ఇచ్చింది. మా కలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.’’

- జూటూరి కనకదుర్గ (నందమూరి నగర్‌)

మా జీవితాల్లో నిజమైన పండుగ

‘‘మేము ఉంటున్న ఇంటికి 35 ఏళ్లుగా పట్టా లేకపోవడంతో ఏ ప్రభుత్వం ఎప్పుడు పడగొడుతుందో అనే భయం ఉండేది. సుమారు రూ.80 లక్షల విలువల చేసే స్థలానికి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేసి పట్టాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మా ఇంటికి చట్టబద్ధమైన హక్కు, బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు లభించాయి. మా జీవితాల్లో నిజమైన పండుగ ఈ రోజే వచ్చింది.’’

- నందమూరి అన్నామణి, నందమూరి నగర్‌

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 03:37 AM