Share News

కస్టడీలో కారుమూరు

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:22 AM

మద్యం రవాణా స్కామ్‌లో వైసీపీ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావును ’సిట్‌’ కస్టడీకి తీసుకుంది. జగన్‌ ప్రభుత్వంలో మద్యం రవాణా ధరలు భారీగా పెంచేసి లబ్ధి పొందిన వారిలో కారుమూరు కుటుంబం ముందు వరుసలో ఉంది.

కస్టడీలో కారుమూరు

  • మద్యం రవాణాలో లింకులపై సిట్‌ గురి

  • ఐదు రోజులు కస్టడీకి అనుమతించిన కోర్టు

  • హైదరాబాద్‌ జైలు నుంచి విజయవాడకు తెచ్చేసరికే సాయంత్రం అయిన వైనం

  • ప్రశ్నించకుండానే బెజవాడ జైలుకు తరలింపు

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా స్కామ్‌లో వైసీపీ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావును ’సిట్‌’ కస్టడీకి తీసుకుంది. జగన్‌ ప్రభుత్వంలో మద్యం రవాణా ధరలు భారీగా పెంచేసి లబ్ధి పొందిన వారిలో కారుమూరు కుటుంబం ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఆయన కుమారుడు సునీల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. ఆయన విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నాగేశ్వరరావుకు నోటీసులు ఇచ్చినా, అందుబాటులోకి రాలేదు. నిఘా పెట్టిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్న నాగేశ్వర రావును అరెస్టు చేశారు. అయితే అంతకు ముందు ఏపీ సిట్‌ అధికారులు ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా మాజీ మంత్రి స్పందించలేదు. విచారణకు రాకుండా ముఖం చాటేశారు. ఈడీ అరెస్టుతో ఎట్టకేలకు ఏపీ సిట్‌ కస్టడీ కోరుతూ, కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఐదు రోజుల పాటు విచారణకు కోర్టు అనుమతించడంతో సిట్‌ అధికారులు హైదారాబాద్‌కు వెళ్లి అక్కడి చల్లపల్లి జైల్లో ఉన్న కారుమూరు నాగేశ్వర రావును అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టినప్పటికే సాయంత్రం ఐదు గంటలైంది. కోర్టు నిబంధన మేరకు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ప్రశ్నించకూడదు. దీంతో మొదటి రోజు సిట్‌ అధికారులు విచారించకుండానే విజయవాడ జైలుకు తరలించారు. మరో నాలుగు రోజుల కస్టడీలో కీలక ప్రశ్నలు సిట్‌ అధికారులు సంధించే అవకాశం ఉంది. రవాణా టెండర్లలో నిబంధనల మార్పు, ఆ మార్పుతో కారుమూరి కుటుంబం పొందిన లబ్ధి, సబ్‌ కాంట్రాక్టులు ఎలా దక్కాయి, కుమారుడు సునీల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్టుల మధ్య ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.


నాకేమీ తెలీదు: ఈశ్వర్‌ కిరణ్‌

మద్యం రవాణా ధరల పెంపు, ఇతర అక్రమాల గురించి తనకేమీ తెలీదని లిక్కర్‌ స్కామ్‌లో కింగ్‌పిన్‌ రాజ్‌ కసిరెడ్డి కీలక అనుచరుడు తుకేకుల ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి సిట్‌కు చెప్పినట్లు తెలిసింది. లాజిస్టిక్‌ వ్యాపారం చేసే కిరణ్‌కుమార్‌రెడ్డి మద్యం స్కామ్‌లో ఏ-1 కసిరెడ్డి వసూల్‌ దందా సైన్యానికి నాయకత్వం వహించాడు. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయి, ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయాడు. ఇటీవల హైదరాబాద్‌ విమానాశ్రయానికి రావడంతో సిట్‌ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మద్యం రవాణా స్కామ్‌లో విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు మొదటి రోజైన సోమవారం ఎంత ప్రశ్నించినా తనకు ఏమీ తెలీదంటూ దాటవేసినట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన సిగ్మా లాజిస్టిక్స్‌ వాళ్లు టెండర్‌ దక్కించుకున్నారని, తన స్నేహితుడు అనిల్‌కుమార్‌ ప్రతిపాదనతో తనను సంప్రదించారని, లాజిస్టిక్స్‌ వ్యాపారంలో ఉన్న తాను మద్యం రవాణా సబ్‌ కాంట్రాక్టు తీసుకున్నానని చెప్పినట్లు తెలిసింది. అయితే సిగ్మా ప్రతినిధులను ఇప్పటికే సిట్‌ అధికారులు విచారించారు. అది పేపర్లో మాత్రమే ఉందని, అతి తక్కువగా 4శాతం కమీషన్‌ ఇచ్చి....అంతా కసిరెడ్డి, ఈశ్వర్‌ నడిపించినట్లు ఆధారాలతో తేల్చారు. ఈ కోణంలో కిరణ్‌ను మంగళవారం గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:22 AM