Share News

భార్గవకు భలే బాధ!

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:03 AM

మద్యం పాలసీ రూపకల్పన నుంచి లిక్కర్‌ బ్రాండ్ల అనుమతి, ఆర్డర్‌ ఫర్‌ సేల్‌ వరకూ ప్రతిదీ పర్యవేక్షించాల్సిన స్పెషల్‌ సీఎస్‌ నాడు చోద్యం చూశారు. తన ముందే అక్రమాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఉండి పోయారు.

భార్గవకు భలే బాధ!

  • లిక్కర్‌ స్కామ్‌లో ‘సిట్‌’ పిలిచినప్పుడల్లా రజత్‌ భార్గవకు ఏదో ఒక ‘అనారోగ్యం’

  • అప్పటి అక్రమాలపై విచారణకు సిట్‌ నోటీసులు

  • కాలు విరిగింది, స్వైన్‌ ఫ్లూ అంటూ సాకులు

  • ఇంటికి వస్తామంటే.. నీరసంగా ఉందంటూ డుమ్మా

  • రిటైర్డు ఐఏఎస్‌ తీరుతో ముందుకెళ్లని సిట్‌ దర్యాప్తు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): మద్యం పాలసీ రూపకల్పన నుంచి లిక్కర్‌ బ్రాండ్ల అనుమతి, ఆర్డర్‌ ఫర్‌ సేల్‌ వరకూ ప్రతిదీ పర్యవేక్షించాల్సిన స్పెషల్‌ సీఎస్‌ నాడు చోద్యం చూశారు. తన ముందే అక్రమాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఉండి పోయారు. ఫలితంగా గత వైసీపీ ప్రభుత్వంలో దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణానికి సాక్షి అయ్యారు.ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో చెప్పాలంటూ లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు పదే పదే నోటీసులిస్తున్నా, ప్రతిసారీ అనారోగ్య కారణాలు చెప్పి దాట వేస్తున్నారు. కాలు విరిగిందని ఒకసారి, స్వైన్‌ ఫ్లూ అంటూ మరో సారి, నీరసంగా ఉందంటూ ఇంకోసారి వరుస సాకులు చెబుతున్నారు. ’మీ వద్దకే వస్తాం..’ అన్నా సిట్‌ అధికారులకు సహకరించడం లేదు. ఆయన ఎవరో కాదు, జగన్‌ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ సీఎ్‌సగా పనిచేసి కూటమి ప్రభుత్వంలో పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ. నాసిరకం మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, ప్రైవేటు వ్యక్తులు లిక్కర్‌ వ్యవహారాల్లో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నా కనీసం స్పందించలేదన్న ఆరోపణలు రజిత్‌ భార్గవపై ఉన్నాయి. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో నాడు రూ.3200కోట్ల లిక్కర్‌ స్కామ్‌ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఎక్సైజ్‌ శాఖకు సంబంధం లేని వ్యక్తులు మద్యం వ్యవహారాల్లోకి చొరబడి అడ్డగోలు పనులు చేశారు. అయినా.. స్పెషల్‌ సీఎస్‌ స్థాయిలో ఉన్న రజత్‌ భార్గవ కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు.


ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుగా ఉంటూ లిక్కర్‌ స్కామ్‌లో కింగ్‌ పిన్‌గా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి డిస్టిలరీస్‌ కూడా లేని వారి పిచ్చి బ్రాండ్లకు సిఫారసు చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అనూష ఆర్డర్‌ ఫర్‌ సేల్‌కు విరుద్ధంగా మద్యం ఆర్డర్లు ఇచ్చేవారు. అయినా, ఇదేంటని కూడా ఏనాడూ రజిత్‌ భార్గవ అడగలేదు. అందుకు ప్రధాన కారణం ఆయనకూ ముడుపులు అందడమేనని ’సిట్‌’ కొంతమేర సమాచారాన్ని సేకరించింది. ఈ విషయమై ప్రశ్నించేందుకు నెలన్నరగా దర్యాప్తు అధికారులు నోటీసులు ఇస్తుంటే, ఆయన అనారోగ్య కారణాలు సాకుగా చూపుతున్నట్లు తెలిసింది. ఈ నెల 24న తప్పకుండా విచారణకు వస్తానని చెప్పి ,స్వైన్‌ ఫ్లూ వచ్చిందంటూ ఎగ్గొట్టారు. దీంతో తామే హైదరాబాద్‌కు వచ్చి ప్రశ్నిస్తామంటూ సిట్‌ అధికారులు ఫోన్‌ చేశారు. దీనిని ఆయన ’నీరసంగా ఉంది, కొన్ని రోజులు సమయం కావాలి’ అంటూ దాటవేసినట్లు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌లో చార్జీషీట్‌ వేసే ప్రయత్నాల్లో ఉన్న సిట్‌ అధికారులను రజత్‌ భార్గవ సాకులు, వాయిదాలు ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి.

వివేక్‌ యాదవ్‌ ’సర్‌’తో బిజీ..

వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి వివేక్‌ యాదవ్‌ను ప్రశ్నించి అప్పట్లో జరిగిన అక్రమాలు నిర్ధారించుకునే ప్రయత్నం చేసిన సిట్‌ అధికారులకు ఆయన కలిసి రావట్లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన గత కొంత కాలంగా ’సర్‌’ కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. అది ముగిసేలోపు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. దీంతో ఆయన ఎప్పుడు సమయం ఇస్తారా.... అక్రమాలకు సంబంధించిన అనుమానాలు ఎప్పుడు నివృత్తి చేసుకుంటామా..అంటూ సిట్‌ అధికారులు ఎదురు చూస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:03 AM