విద్యావ్యవస్థ బలోపేతానికి సింగపూర్ సహకారం
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:36 AM
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ బలోపేతానికి సింగపూర్ ప్రభుత్వం సహకరిస్తుందని ఆ దేశ హోంమంత్రి షణ్ముగం హామీ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో మంత్రి లోకేశ్‌తో ఆయన వివిధ అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో విద్యా సంస్కరణలు బాగున్నాయి
లోకేశ్‌ను ప్రశంసించిన సింగపూర్ మంత్రి షణ్ముగం
అమరావతి, తిరుపతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ బలోపేతానికి సింగపూర్ ప్రభుత్వం సహకరిస్తుందని ఆ దేశ హోంమంత్రి షణ్ముగం హామీ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో మంత్రి లోకేశ్‌తో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాశాఖలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను షణ్ముగానికి లోకేశ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన అభినందించారు. బడి మానేసే పిల్లలే భవిష్యత్తులో డ్రగ్స్ బారినపడటం, వివిధ సామాజిక సమస్యలకు దారితీస్తోందని షణ్ముగం అభిప్రాయపడ్డారు. ఏపీలో డ్రాపౌట్లు తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందిస్తూనే, డ్రాపౌట్లు సున్నా శాతానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపేలా చేపట్టిన చర్యలను లోకేశ్ వివరించారు. ఏపీలో విద్యా వ్యవస్థకు అవసరమైన సహకారం అందిస్తామని సింగపూర్ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే సమాజానికి విపత్తుగా మారిన డ్రగ్స్ నిర్మూలనకు అత్యంత కఠినమైన శిక్షలు, చట్టాలు ఉండాలని సూచించారు.
సింగపూర్‌లో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవలంబించిన విధానాలను వివరించారు. డ్రగ్స్ రహిత ఏపీ కోసం సింగపూర్ మోడల్‌ను అనుసరించాలని సూచించారు. సాంకేతిక విద్యను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చడంలో సింగపూర్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ (ఐటీఈ) సాధించిన విజయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐటీఐలను సింగపూర్ ఐటీఈతో అనుసంధానించడం ద్వారా యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
శ్రీవారి సేవలో లోకేశ్, షణ్ముగం
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, సింగపూర్ మంత్రి షణ్ముగం మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రే వీరు తిరుమలకు చేరుకుని బస చేశారు. మంగళవారం వేకువజామున లోకేశ్, షణ్ముగంతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు చేరుకున్నారు. క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన ఇద్దరూ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో మంత్రులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. మంత్రుల వెంట టీవీఎస్ మోటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, దివాకరరెడ్డి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నారు.
స్వామే పిలిచి దర్శనమిచ్చారు: షణ్ముగం
‘ఇది నేను కోరుకున్న దర్శనం కాదు. స్వామే పిలిచి ఇచ్చిన దర్శనం’ అని సింగపూర్ మంత్రి షణ్ముగం అన్నారు. దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, చాలా రోజుల క్రితం స్వామి దర్శనానికి వచ్చానని, మళ్లీ ఇప్పుడు ఆ భాగ్యం కలిగిందన్నారు. మంచి దర్శనం, మంచి ఏర్పాట్లు చూశానన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం