మళ్లీ మోతెక్కిన రొయ్య మేత ధరలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:28 AM
ఆక్వా రైతులపై మళ్లీ మేత ధరల భారం పడింది. వనామీ రొయ్యల మేత ధరను కిలోకు రూ.8, టైగర్ రొయ్యల మేత ధరను కిలోకు రూ.11 చొప్పున తయారీ కంపెనీలు పెంచాయి.
కిలోకు రూ.8నుంచి రూ.11 వరకు పెంపు
కోర్టు జోక్యంతో ఇటీవల తగ్గించిన రూ.8 తిరిగి పెంపు
మండవల్లి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులపై మళ్లీ మేత ధరల భారం పడింది. వనామీ రొయ్యల మేత ధరను కిలోకు రూ.8, టైగర్ రొయ్యల మేత ధరను కిలోకు రూ.11 చొప్పున తయారీ కంపెనీలు పెంచాయి. దీంతో టన్ను వనామీ మేతపై రూ.8 వేలు, టైగర్ మేతపై రూ.11 వేలు అదనపు భారం పడనుంది. ఇటీవల మేత ధరలను కిలోకు రూ.10 చొప్పున పెంచగా, న్యాయస్థానం జోక్యంతో అందులో రూ.8 తగ్గించారు. దీంతో కిలోకు రూ.2 పెంపు మాత్రమే అమల్లో ఉండగా, తాజాగా తగ్గించిన రూ.8ను తిరిగి పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఈ ధరల సవరణ 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించాయి. ఇప్పటికే వనామీ రొయ్యల మేత టన్ను రూ.96 వేలు వరకు పలుకుతుండగా, దీనికి మరో రూ.8వేలు అదనంగా పెరగడంతో రూ.1,04,000 వరకు ఆక్వా రైతులు భరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విత్తనాలు, విద్యుత్, మందులు, చెరువుల నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రొయ్యల రైతులకు తాజా ధరల పెంపు మరింత భారంగా మారనుంది. రొయ్యల విక్రయ ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో పెరిగిన మేత ఖర్చును భరించడం రైతులకు సవాలుగా మారింది. మేత ధరలు పెరుగుతున్నా, సాగు చేసిన రొయ్యలకు గిట్టుబాటు ధర లభిస్తుందని భరోసా లేకపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు