Share News

రోడ్‌ టెర్రర్‌!

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:52 AM

21(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ల నిద్రమత్తు.. కార్ల అతివేగం.. వెరసి రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యాడు. ఒక ఘటనలో నవదంపతులు గాయాలతో బయటపడగా...

రోడ్‌ టెర్రర్‌!

  • నిద్రమత్తు.. అతివేగానికి ఏడుగురు బలి

  • ప్రకాశంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

  • కల్వర్టును ఢీకొట్టి కాలువలోకి ఎగిరిపడ్డ కారు

  • నలుగురి దుర్మరణం..

  • నవ దంపతులకు గాయాలు

  • తిరుమల నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం

  • మరో ఘటనలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు

  • ముగ్గురి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

ఒంగోలుక్రైం, కుంకలమర్రు(పర్చూరు), నవంబరు 21(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ల నిద్రమత్తు.. కార్ల అతివేగం.. వెరసి రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యాడు. ఒక ఘటనలో నవదంపతులు గాయాలతో బయటపడగా, మరో ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీప హైవేపై శనివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. వధూవరులు గాయపడ్డారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని ఇంటికి తిరిగొస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ కథనం ప్రకారం.. బాపట్లలోని నరాలశెట్టి వారి వీధికి చెందిన జంపాల శ్రీతేజ, విజయవాడ గొల్లపూడికి చెందిన తాడిశెట్టి శ్రీకైవల్య వివాహం ఈనెల 18న బాపట్లలో జరిగింది. వివాహానంతరం మొక్కు తీర్చుకునేందుకు రెండు వాహనాల్లో ఇరుకుటుంబాలవారు తిరుమల వెళ్లారు. 20 తేదీ రాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం ఉదయం ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్దకు వచ్చేసరికి కారు నడుపుతున్న, పెళ్లికొడుకు సోదరుడి స్నేహితుడు కొప్పవరపు ప్రవీణ్‌(29)నిద్రమత్తులో రోడ్డుకు ఎడమ వైపు ఉన్న కల్వర్టును అత్యంత వేగంగా ఢీకొట్టాడు.

దీంతో కారు ఎగిరి కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన ప్రవీణ్‌తోపాటు కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు జంపాల వెంకట్రావు(55), సుజాత (50), పెళ్లికుమార్తె తల్లి తాడిశెట్టి సీతామహాలక్ష్మి(50) అక్కడికక్కడే మృతిచెందారు. నవదంపతులు శ్రీతేజ, శ్రీకైవల్యకు గాయాలయ్యాయి. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కారు బయటకు తీయించి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.


నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురిని మింగిన ప్రమాదం

బాపట్ల జిల్లాలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన కారంచేడు మండలం, కుంకలమర్రు సమీపంలోని జాతీయరహదారిపై శనివారం చోటుచేసుకుంది. చీరాల డీఎస్పీ మొయిన్‌ కథనం మేరకు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సమీప బంధువులు బొప్పూడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. భోజనం చేసి చీరాల మండలం రామాపురం బీచ్‌ బయలుదేరారు.

తెల్లవారుజాము నుంచి అలసిపోయి, సాయంత్రమే భోజనం చేయడంతో డ్రైవర్‌కు నిద్ర ముంచుకొచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో పాలేపు లక్ష్మయ్య(65), గుంజి నాగేంద్రం (55) అక్కడికక్కడే మృతిచెందారు. అశ్విని(4) అనే చిన్నారి అసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. బొప్పూడికి చెందిన కారు డ్రైవర్‌ పల్లపు గురుస్వామి(గుంటూరులో నివాసం)కి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన ఏడుగురిని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మెరుగైన వైద్యానికి ఆదేశాలు

ప్రమాదం సమాచారం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన నూతన దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Updated Date - Nov 22 , 2026 | 07:07 AM