పదవి కోసం పెళ్లి!
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:28 AM
ఎనిమిదేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న జంట, బీసీ రిజర్వేషన్ ప్రకటన వెలువడిన గంటల్లోనే ఒక్కటైంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా..
చైర్పర్సన్ పదవి కోసం మరదలికి తాళి
సాలూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న జంట, బీసీ రిజర్వేషన్ ప్రకటన వెలువడిన గంటల్లోనే ఒక్కటైంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ బీసీ మహిళను అతగాడు వరించాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన వైకుంఠపు హర్షవర్ధన్, వరుసకు మరదలైన గుళ్ల మంజీరా ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మరో 6నెలల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ అయిన హర్షవర్ధన్ స్థానిక ఎన్నికలపై కన్నేశారు. ఇంతలో.. సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తూ సోమవారం ప్రకటన వెలువడింది.
ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ హుటాహుటిన మంజీరాను మంగళవారం వివాహం చేసుకున్నారు. సాలూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం 32 వార్డులు ఉన్నాయి. చైర్పర్సన్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ పదవికి ఆశావహులు పెరిగారు. అయితే ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో పలువురు ఆశావహులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ తన ప్రేమ వివాహంతో రాజకీయంగా తెరపైకి వచ్చారు. హర్షవర్ధన్ 2019లోటీడీపీ కౌన్సిలర్గా గెలిచారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విధేయుడిగా పేరున్న ఆయనకు బలమైన సామాజిక వర్గం అండతోపాటు రాజకీయ అనుభవం కూడా ఉంది. ఆయన తండ్రి వైకుంఠపు పంచముఖి సైతం గతంలో కౌన్సిలర్గా ప్రజలకు సేవలందించారు. ఈ నేపథ్యం లో హర్షవర్ధన్ వివాహం చర్చనీయాంశమైంది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత