సాయికృష్ణ చనిపోయింది కస్టడీలోనే?
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:09 AM
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సంచలన విషయాలు బయట పెట్టింది.
శవం మాయం.. ఆధారాలు ధ్వంసం?
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
మార్కాపురంలో అదుపులోకి.. కృష్ణలంక పీఎస్‌లో టార్చర్
స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం కోర్టును తప్పుదోవ పట్టించిన వైనం
సీఐ నాగరాజు రిమాండ్
రిపోర్టులో కోర్టుకు తెలిపిన సిట్
17 మంది సాక్షుల విచారణ
వాంగ్మూలాలతో ప్రాథమిక నిర్ధారణ
మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు
రాజమండ్రి జైలుకు నాగరాజు
వచ్చే నెల ఎనిమిది వరకు రిమాండ్
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సంచలన విషయాలు బయట పెట్టింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కస్టడీలో పెట్టిన హింసతోనే సాయికృష్ణ మృతి చెంది ఉండొచ్చని కోర్టుకు తెలిపింది. మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసింది. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు నిజాలు చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించినట్లు ఆరోపించింది. పాత కేసుల్లో కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్‌లో టార్చర్‌కు గురి చేసినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు తెలిపింది. కృష్ణలంక మాజీ సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఆయన ప్రమేయాన్ని కోర్టుకు వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐజీ రవిప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన దర్యాప్తు అధికారి సుధాకర్ ప్రాథమిక విచారణ అనంతరం సీఐ నాగరాజుపై బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద హత్య-103(1), అక్రమ నిర్బంధం-127(4), చట్టవిరుద్ధంగా నిర్బంధం కొనసాగింపు-127(6), ఆధారాలు మాయం-238 కేసు నమోదు చేశారు. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ(25)పై మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో ఉన్న అతడిని గుర్తించి మే 5 వేకువజామున 3 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి మే 6న ఉదయం 7గంటల ప్రాంతంలో సెంట్రీ కానిస్టేబుల్‌కు అప్పగించారు. నిందితుడిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సిన సీఐ నాగరాజు ఆ పని చేయలేదు.
ఈ విషయం తెలిసి సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐని అడగ్గా.. తనను తీవ్ర పదజాలంతో దూషించినట్లు సిట్‌కు తెలిపింది. అదే సమయంలో తన కుమారుడి కేకలు వినిపించాయని, కాసేపటికి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడని చెప్పింది. లాక్‌పలో తీవ్ర గాయాలతో ఉన్నట్లు తన కళ్లారా చూసినట్లు ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ కోర్టుకు సమర్పించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ(న్యాయవాది) మే 8 వరకూ పలుమార్లు స్టేషన్‌కు వెళ్లి అడగ్గా సీఐ పొంతనలేని సమాధానాలు చెప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా, కోర్టుకు సైతం నిజాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించారు. తమ విచారణలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఇతర ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు సాయికృష్ణ మే 6 నుంచి 8 వరకూ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సిట్ 17 మంది సాక్షులను విచారించింది.
సీసీ ఫుటేజీ మాయం..
కేసులో అత్యంత కీలకంగా మారిన సీసీ ఫుటేజీ నిమే 1 నుంచి జూన్ 1 వరకూ లేకుండా తొలగించారు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. కృష్ణలంక స్టేషన్ డీవీఆర్‌లో వీడియో డేటా లభించలేదని స్పష్టం చేసినట్లు సిట్ తెలిపింది. ఈ చర్యతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకపోవడం, కుమారుడి ఒంటిపై గాయాలు చూశానన్న తల్లి స్టేట్‌మెంట్, సాయికృష్ణ ఆచూకీ లభించకపోవడంతో అతను కస్టోడియల్ హింస వల్లే మృతిచెందినట్లు బలమైన అనుమానం వ్యక్తం చేసింది. సాయికృష్ణ మృతిపై నిర్ధారణకు వచ్చిన తాము శవం కోసం గాలించినా లభించలేదని, దాచి పెట్టారా.. తగుల బెట్టి బూడిద చేశారా.. ఇంకేమైనా రహస్యం దాగుందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు సిట్ వివరించింది. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉంది.. సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల్ని సైతం విచారించనున్నట్లు కోర్టుకు తెలిపింది. నాగరాజును 23న అరెస్టు చేసి విచారించగా, దర్యాప్తునకు సహకరించడం లేదని ఆరోపించింది. ‘సాయికృష్ణ ఏమయ్యాడు.. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ మీకు అప్పగించినట్లు రికార్డులో ఉందిగా.. సీసీ ఫుటేజీ ఎందుకు మాయం చేశావ్’ అని ఏది అడిగినా సమాధానం చెప్పడం లేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కేసుతో సంబంధం లేని సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించింది. నిందితుడు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పోలీసు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని, ఇంకా సేకరించాల్సిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నందున జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని కోర్టును అభ్యర్థించింది.
ముగ్గురు మహా ముదుర్లు
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీఐలు ఎందరు మారినా ఇక్కడే ఉంటూ చక్రం తిప్పుతున్న ఒక కానిస్టేబుల్ పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ స్టేషన్‌కు వచ్చిన ఆ కానిస్టేబుల్ పేరు చెప్పగానే ఆ ప్రాంతంలో అందరూ షాడో సీఐ అని అంటారు. అతనికి తోడు గతంలో పటమట పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని కృష్ణలంక పీఎ్‌సకు వచ్చిన మరో కానిస్టేబుల్ పాత్రపైనా సిట్ కూపీ లాగుతోంది. ఈ ఇద్దరితో పాటు బార్‌లో గొడవ వ్యవహారంలో సస్పెండైన మరో కానిస్టేబుల్ వ్యవహారంపైనా సిట్ అధికారులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించాక టాస్క్‌ఫోర్స్ పోలీసుల్ని, కృష్ణలంక ఏసీపీని సైతం ప్రశ్నించే అవకాశం ఉంది.
రాజమండ్రి జైలుకు నాగరాజు
సీఐ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజుకు న్యాయస్థానం వచ్చే నెల 8వరకు రిమాండ్ విధించింది. ఆయనను బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. సిట్ అధికారులు నాగరాజును మొదట కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి వాదనలు వినిపించారు. నాగరాజు తరఫున న్యాయవాది సాంబశివరావు వకాల్తా మోమో దాఖలు చేశారు. వాదనలు ఏమైనా వినిపిస్తారా అని న్యాయాధికారి అడగ్గా తాను ఏమీ చెప్పనన్నారు. ఈ కేసులో నిందితుడు, దర్యాప్తు అధికారులు తప్ప మిగిలిన వారంతా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోవాలని, లేకపోతే చాంబర్‌లో విచారణ చేస్తానని న్యాయాధికారి స్పష్టం చేశారు. హాలు నుంచి న్యాయవాదులు ఎవరూ బయటకు వెళ్లకపోవడంతో న్యాయాధికారి బెంచ్ దిగి వెళ్లిపోయారు. తొలుత నాగరాజును చాంబర్‌లోకి పిలిపించారు. 15 నిమిషాల పాటు విచారించారు. తర్వాత దర్యాప్తు అధికారులను పిలిపించారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సభ్యుడు సుధాకర్(పల్నాడు అదనపు ఎస్పీ), సహాయకుడిగా ఉన్న ఏలూరు మహిళా పీఎస్ డీఎస్పీ యు.రవిచంద్ర చాంబర్‌లోకి వెళ్లారు. వారితో న్యాయాధికారి దాదాపు 25 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం నాగరాజుకు వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా కోర్టు హాలు వద్ద సాయికృష్ణ పిన్ని, న్యాయవాది కనకదుర్గ కేకలు వేశారు. నాగరాజును న్యాయాధికారి చాంబర్‌లోకి పిలిపించి విచారించడంపై స్పందించారు. హత్య కేసులో ముద్దాయిలను చాంబర్‌లోకి ఎలా పిలిపిస్తారని ప్రశ్నించారు. నిందితులందరిని కోర్టు హాలులో విచారించినప్పుడు, నాగరాజును ఎందుకు అలా చేయలేదని కేకలు వేశారు.
కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
సీఐ నాగరాజును జైలుకు తరలించడానికి వాహనం ఎక్కిస్తుండగా ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వాయిదా నిమిత్తం కోర్టుకు వచ్చారు. కోర్టు సముదాయాల భవనం వద్ద పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉండడంతో అక్కడున్న వారిని ఏమైందని అడిగారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజును అరెస్టు చేసి, జైలుకు తరలిస్తున్నారని చెప్పారు. ఆమె జీపు వద్దకు వెళ్లి నాగరాజును చూసి చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఓ సమస్యపై కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లినప్పుడు న్యాయం చేశారని తెలిపారు.
జైలు వద్దకు అభిమానులు
సీఐ నాగరాజును బందోబస్తుతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తీసుకొచ్చారు. గతంలో నాగరాజు తాడేపల్లిగూడెం, భీమవరంలో పని చేశారు. ఆ ప్రాంతాల నుంచి సీఐని చూడడానికి ఆయన అభిమానులు జైలు వద్దకు మధ్యాహ్నమే చేరుకున్నారు. నాగరాజు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారని, అందుకే ఇప్పుడు ఇక్కడి వరకూ వచ్చామని చెప్పారు. రౌడీషీటర్లు, అసాంఘిక వ్యక్తుల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తారని అత్తిలికి చెందిన ఓ యువకుడు అన్నాడు. రౌడీలు, దొంగలను ఉక్కుపాదంతో అణచివేసేవారని, రాత్రి వేళల్లో బైక్‌పై తిరుగుతూ ప్రజలకు రక్షణ కల్పించేవారని.. ఇప్పుడు ఓ రౌడీషీటర్ విషయంలో ఆయనను బలిపశువును చేయడం ఆవేదన కలిగిస్తోందన్నాడు.