Share News

సాయికృష్ణ కేసులో పారదర్శక దర్యాప్తు

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:53 AM

విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు వివరించారు.

సాయికృష్ణ కేసులో పారదర్శక దర్యాప్తు

  • సాయికృష్ణ కేసులో పారదర్శక దర్యాప్తు

  • ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపాం

  • సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

  • స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలన్న కోర్టు

  • నేటి ఉదయం 10.30కు ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు వివరించారు. అయితే, సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌కు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును తమకు అందించాలని, గురువారం ఉదయం 10.30 కల్లా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, మృతి, సాక్ష్యాధారాల ధ్వంసం వ్యవహారంలో ఏపీ డీజీపీ, విజయవాడ సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ నెల17న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ వాదనలు వినిపిస్తూ... సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాక మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచలేదని తెలిపారు.

ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మే 1 నుంచి జూన్‌ 1 వరకు పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారన్నారు. మే 28న సాయికృష్ణ తల్లి డీజీపీకి ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దాదాపు నెలరోజులకు నామమాత్రపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. అసలు బాధ్యులైన డీజీపీ, సీపీ, ఏసీపీలపై చర్యలు చేపట్టాలని దిగువ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశిస్తే, ఏసీపీ హైకోర్టుకు వెళ్లి మధ్యంతర స్టే తెచ్చుకున్నారని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును సిట్‌ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని, ప్రధాన నిందితుడైన కృష్ణలంక సీఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరో పైవ్రేట్‌ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. ఈ ఘటనలో కింది స్థాయి అధికారులదే పూర్తి బాధ్యతని తెలిపారు. పోలీసు అధికారుల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..


పోలీస్‌ స్టేషన్‌ స్థాయిలో సీఐ, ఇతర సిబ్బంది చేసిన తప్పులకు డీజీపీ, సీపీ స్థాయి ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలనడం చట్టవిరుద్ధమని వాదించారు. ఉన్నతాధికారులను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీసీటీవీ కెమెరాలు పనిచేయకోపవడం ఏమిటని, ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ కేసు విచారణలో సీబీఐని ఇంప్లీడ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. మరోసారి లూథ్రా వాదనలు వినిపిస్తూ.. హెబియస్‌ కార్పస్‌ సహా సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు తీర్పు వాయిదా వేసిన పిటిషన్లు, స్టేటస్‌ రిపోర్టును తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

Updated Date - Sep 24 , 2026 | 05:53 AM