Share News

ఎండాడ భూమి కేసులో ప్రైవేటుకు కొమ్ము

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:16 AM

విశాఖలోని ఎండాడలో ఖరీదైన భూముల కేసులో జిల్లా సర్వే అధికారి వైఫల్యం బయటపడింది. ఆయన ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాశారని, విలువైన ప్రభుత్వ భూమిని వారు దోచుకునేందుకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధం చేశారని ప్రభుత్వం గుర్తించింది.

ఎండాడ భూమి కేసులో ప్రైవేటుకు కొమ్ము

  • నిజాలు నిగ్గు తేల్చిన రెవెన్యూ

  • తప్పులు తేలినా అక్కడే కొనసాగింపు

  • తెర వెనక పెద్దల మద్దతు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : విశాఖలోని ఎండాడలో ఖరీదైన భూముల కేసులో జిల్లా సర్వే అధికారి వైఫల్యం బయటపడింది. ఆయన ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాశారని, విలువైన ప్రభుత్వ భూమిని వారు దోచుకునేందుకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధం చేశారని ప్రభుత్వం గుర్తించింది. విశాఖ జిల్లా సర్వే సెటిల్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌పై ఈ మేరకు అభియోగాలు నమోదు చేసింది. అయితే గత కొన్ని నెలలుగా ఆయన్నే విశాఖ డీడీగా కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. తెరవెనక పెద్దల మద్దతుతోనే అక్కడ కొనసాగుతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎండాడలో భూముల విలువ ఎకరం రూ.20 కోట్ల పైమాటే. అలాంటి చోట సర్వే నంబర్‌ 13లో విలువైన ప్రభుత్వ భూములు, ఇంకా హౌసింగ్‌ బోర్డు స్థలాలున్నాయి. అందులో సర్వే నంబర్‌ 13-4లో 4.6 ఎకరాల భూమిని ప్రైవేటు రైత్వారీగా చూపించేందుకు జిల్లా సర్వే అధికారులు ప్రయత్నించారు. తమ రిపోర్టు ప్రకారం భూములు సెటిల్‌ చేయాలని స్థానిక తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ పరిణామాలపై ఈ ఏడాది జూలై 3న ‘విశాఖలో పెద్దల మంత్రాంగం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. ఒక సర్వే నంబర్‌లో చూపించాల్సిన ప్రైవేటు రైత్వారీని ప్రభుత్వ భూములున్న సర్వే నంబర్‌లో చూపించి, అందుకు ప్రత్యేకంగా సబ్‌డివిజన్‌ చేసి మరీ రికార్డులు రూపొందించారు. ‘ఆంధ్రజ్యోతి’ వార్తపై సర్వే అధికారులు స్పందించి డీడీని అమరావతిలోని ప్రధాన కార్యాలయానికి సరెండర్‌ చేశారు. అక్కడే పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. సర్వే డీడీపై చర్యలు తీసుకోవద్దని సర్వే డైరెక్టర్‌పై కొందరు పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో కొంతకాలం తర్వాత మళ్లీ ఆయన్నే విశాఖ సర్వే డీడీగా పంపించారు. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. అయితే ఆయనపై వచ్చిన ఎండాడ భూముల కేసు ఆరోపణలపై రెవెన్యూ శాఖ విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చింది. ఆయన తప్పు చేశారని, ప్రైవేటు వ్యక్తులకు మేలు జరిగేలా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేస్తూ సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఉత్తర్వులు (జీఓ 1738) జారీ చేశారు.


అభియోగాలు ఇవే

మాస్టర్‌ డిస్ర్కిప్టివ్‌ రిజిస్టర్‌ (ఎండీఆర్‌), సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ ప్రకారం రూపొందిన ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎమ్‌బీ)ల్లో ఉన్న డేటా ప్రకారం ఎండాడలోని సర్వే నంబర్‌ 13లో 1 నుంచి 5 సబ్‌ డివిజన్‌ల కింద 14.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో 13-4లో ఉన్నది 59 సెంట్లే. కానీ సర్వే అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై 4.60 ఎకరాల భూమి ఉన్నట్లుగా నివేదికలు తయారు చేశారు. ఇలా సృష్టించిన భూమిని ఇతర సబ్‌ డివిజన్ల పరిధిలో ఉన్న దాంట్లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నేపథ్యం సిద్ధం చేశారు. 13-2లో ఏపీ హౌసింగ్‌ బోర్డుకు 5.10 ఎకరాల భూమి ఉంది. ఇందులో నుంచే భూమిని పొందాలన్నది ప్రైవేటు వ్యక్తుల పన్నాగం. వారు కోరుకున్నట్లే అధికారులు భూములు సర్వే చేసి నివేదిక రూపొందించారు. 4.60 ఎకరాల భూమి విలువ నికరంగా 100 కోట్లపైమాటే. ఈ ఉదంతంపై విచారణ జరిపిన అధికారులు సర్వే డీడీ రమణమూర్తి తప్పలు చేశారని అభియోగాలు నమోదు చేశారు. డీడీ స్థాయిలో ఉండి తన కింది అధికారి చేసిన సర్వే రిపోర్టును సరిగ్గా పరిశీలన, నిర్ధారణ చేసుకోకుండానే ప్రైవేటుకు అనుకూలంగా భూములున్నట్లుగా రిపోర్టు రాశారని ప్రభుత్వం పేర్కొంది.

కేవలం ఆఫీసులోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకొని తుది నివేదికను సిద్ధం చేశారని గుర్తించింది. అసలైన సెటిల్‌మెంట్‌ రికార్డుకు, సవరించిన ఎఫ్‌ఎమ్‌బీల్లో తేడాలు ఉన్నాయని గుర్తించినా సరే, రిపోర్టు తయారు చేసి తహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో డీడీ అధికార పరిధిని దాటి వ్యవహరించారు. ఈ భూమిపై నివేదిక తయారు చేసి అది జిల్లా అధికార యంత్రాంగానికి చేరేలోపే, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకముందే దానికి సంబంధించిన కాపీని ప్రైవేటు వ్యక్తికి అందించారు. దీనివల్లే ప్రైవేటు వ్యక్తి ఆ భూమిపై యాజమాన్య హక్కును డిమాండ్‌ చేసే పరిస్థితి వచ్చింది. రెవెన్యూ, సర్వే శాఖల్లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, మండల సర్వేయర్లు చిన్న తప్పులు చేస్తేనే రెవెన్యూ శాఖ కన్నెర చేస్తుంది. క్షణాల్లో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. కానీ ఓ జిల్లా ఉన్నతస్థాయి అధికారి తప్పు చేస్తే ఎనిమిది నెలలుగా ఎలాంటి చర్యలు లేవు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:16 AM