సీఎంవో నుంచే లిక్కర్ దందా!
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:15 AM
దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందని అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. లిక్కర్ దందా మొత్తం నాటి సీఎంవో నుంచే జరిగిందని..
అంతా నాటి పెద్దలకు తెలిసే జరిగింది!
రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ సంచలన వాంగ్మూలం
అన్నింట్లో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఒత్తిళ్లు
దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందని అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. లిక్కర్ దందా మొత్తం నాటి సీఎంవో నుంచే జరిగిందని.. అక్రమాలపై అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డికి 50-60 సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. పైగా మెమోలు ఇచ్చిన తనపైనే ఒత్తిడి తెచ్చారని.. ఆర్డర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) అధికారాలు లాగేశారని.. మాన్యువల్ విధానం తీసుకొచ్చి బ్రాండ్ల ఇండెంట్‌లోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడించినట్లు సమాచారం. ప్రతి విషయంలోనూ సీఎంవో నుంచి ఒత్తిడి రావడంతో ఒంటరిగా పోరాడలేక మౌనంగా ఉండాల్సి వచ్చిందని రజత్ భార్గవ పేర్కొన్నట్లు తెలిసింది.
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌కు మెమోలు ఇచ్చా
లిఖితపూర్వక వివరణలు అడగొద్దన్నారు
వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు
ఇది సీఎం జగన్ ఆదేశమన్నారు
నా నుంచి ఓఎఫ్ఎస్ పవర్స్ లాగేశారు
ఆ అధికారాన్ని వారిద్దరికీ కట్టబెట్ట్టారు
మాన్యువల్ వ్యవస్థపై ధనుంజయ్‌కు
50-60 సార్లు చెప్పినా పట్టించుకోలేదు
బ్రాండ్ల ఇండెంట్‌లోనూ సీఎంవో జోక్యం
వారితో పోరాడలేక మౌనంగా ఉన్నా
విజయవాడ కోర్టులో అప్పటి ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ వాంగ్మూలం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక సీఎస్‌గా పనిచేసిన రజత్ భార్గవ గుట్టు విప్పారు. ఎన్ని ఉల్లంఘనలు జరిగాయి.. ఎన్ని రకాలుగా జరిగాయి... తనపై అప్పటి సీఎంవో అధికారులు ఎలా ఒత్తిడి తెచ్చారు... మద్యం ఆర్డర్లలో ఎవరెవరి పాత్ర ఏమిటి... ఇలా అనేక కీలక వివరాలు బయటపెట్టినట్లు తెలిసింది. లిక్కర్ కేసులో మంగళవారం ఆయన విజయవాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరై వాంగ్మూలమిచ్చారు.
2022 ఏప్రిల్లో బ్రాండ్లలో అవినీతి గుర్తించా..
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. 2020 మే 6న ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను.. 2022 ఏప్రిల్‌లో మద్యం బ్రాండ్లలో అక్రమాలు గుర్తించినట్లు రజత్ భార్గవ కోర్టుకు తెలిపారు. ‘మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కాకుండా కొన్ని బ్రాండ్లకు ఇండెంట్ పెట్టడంపై ఏప్రిల్ 19న నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌కు మెమోలు జారీ చేశాను.. మెమోలు ఇవ్వొద్దని అప్పటి ముఖ్యమంత్రి(జగన్) కోటరీలోని ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి నాపై ఒత్తిడి తెచ్చారు. డిమాండ్ ఉన్న బ్రాండ్లను ప్రభుత్వ మద్యం షాపుల్లో అందుబాటులో లేకుండా చేయడం ఉద్దేశపూర్వకమైన అవినీతేనని అర్థమైంది.. కానీ ఆర్డర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) అధికారాలను నా నుంచి తీసేసి వాసుదేవరెడ్డికి, సత్యప్రసాద్‌కు ఉమ్మడిగా ఇచ్చేశారు.. తమకు నచ్చిన బ్రాండ్లను అడ్డగోలుగా ప్రోత్సహించేందుకే ఓఎఫ్ఎస్‌లో టెక్నికల్ సమస్యలు చూపించి మార్చేశారు.. అందులో కుట్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది.. ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష చేసిన ప్రతిసారీ వాటిని ప్రస్తావించాను..
ఈ అంశాలను ధనుంజయ్‌రెడ్డి మినిట్స్‌లో చేర్చనిచ్చేవారు కాదు.. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు చెప్పినా ఫలితం కనిపించలేదు.. పైగా ఎండీకి, ప్రత్యేకాధికారికి ఇచ్చిన మెమోలకు లిఖితపూర్వక వివరణలు అడగవద్దన్నారు.. అయినా నన్ను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని 2023 డిసెంబరు 5న ప్రత్యేకాధికారికి మెమో జారీచేశా.. ఆయన వివరణ సరిగా లేకపోవడంతో చీవాట్లు పెట్టి నా చాంబర్ నుంచి బయటకు పంపించివేశా.. ఓఎఫ్ఎస్ జారీ అధికారాలను సత్యప్రసాద్ నుంచి తొలగించాలంటూ నేనిచ్చిన ఉత్తర్వులను ఎండీ వాసుదేవరెడ్డి అమలు చేయలేదు. గట్టిగా అడిగితే.. నాటి సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి నాకు ఫోన్ చేసి ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకో.. సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిని ఇబ్బంది పెట్టొద్దు.. ఇది సీఎం ఆదేశంగా చెబుతున్నానని అన్నారు.. అందరూ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నట్లు నాకు అర్థమైంది.. కానీ నాటి ప్రభుత్వ పెద్దలతో పోరాడలేక మౌనంగా ఉండిపోయా’ అని రజత్ భార్గవ కోర్టుకు వివరించినట్లు తెలిసింది. తాను 2020లో ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చేపట్టక ముందు.. 2019 వరకూ ఓఎఫ్ఎస్ అధికారాలు ముఖ్య కార్యదర్శి చేతుల్లో ఉండేవని.. వాటిని ప్రత్యేకాధికారికి కట్టబెట్టడం వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం.
డేటా మాయం చేసేందుకు సహకరించలేదు..
‘2019 నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఉన్న ఓఎఫ్ఎస్ డేటా అకస్మాత్తుగా అప్పట్లో సీఎస్‌కు పంపించారు. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అప్పటి ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్‌కు ఫోన్ చేసి పాత తేదీతో సంతకం చేసి పంపమన్నారు. ఆయన అంగీకరించకపోవడంతో నాకు ఫోన్ చేసి.. వివేక్‌తో సంతకం చేయించి ప్రభుత్వంతో ర్యాటిఫై చేయించమన్నారు.. ఆ పని చేయనని చెప్పేశా.. ఇదంతా సెక్రటేరియట్ రికార్డుల్లో ఉంది’ అని రజత్ భార్గవ కోర్టుకు చెప్పినట్లు తెలిసింది.
చంద్రబాబుపై కేసు పెట్టాలంటూ ఒత్తిళ్లు..
2023 అక్టోబరు 29న అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రిమినల్ విశ్వాస ఉల్లంఘన, క్రిమినల్ కుట్ర కింద కేసు పెట్టాలంటూ నాటి సీఎంవో నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. నేను స్పందించకపోవడంతో నా అనుమతి తీసుకోకుండానే వాసుదేవరెడ్డి ముందడుగు వేశారు. ఇదేంటని అడిగితే అప్పటి నిఘా చీఫ్, అడ్వకేట్ జనరల్ పేపర్లు పంపుతారు.. వాటిపై సంతకం చేయాలని ధనుంజయ్‌రెడ్డి, ప్రవీణ్‌ప్రకాశ్, కృష్ణమోహన్‌రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చినట్లు వాసుదేవరెడ్డి నాకు చెప్పారు.. ఆ తర్వాత ఆ ముగ్గురూ నాకు కూడా ఫోన్ చేసి మాజీ సీఎంపై ఫిర్యాదును ర్యాటిఫై చేయాలని ఒత్తిడి చేశారు.. నేను అంగీకరించలేదు’ అని కుట్ర కోణాన్ని రజత్ భార్గవ బయటపెట్టారు.
కమీషన్ల కోసమే నిర్ణయాలు
‘నాడు సిమిలర్ సౌండింగ్ క్లాజ్‌కు విరుద్ధంగా పలు బ్రాండ్ల బేసిక్ ధరను పెంచారు.. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సమర్థించుకున్నారు. అయితే బేసిక్ ధర పెంచితే మద్యం సరఫరాదారులకు, డిస్టిలరీలకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుందని.. అందుచేత అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను పెంచితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని నేను చెప్పినా వినలేదు.. డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి కమీషన్ల కోసమే ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు నాకు అర్థమైంది..’ అని రజత్ భార్గవ తెలిపారు. ధనుంజయ్‌రెడ్డి, ప్రవీణ్ ప్రకాశ్, కృష్ణమోహన్‌రెడ్డి పదే పదే ఫోన్లు చేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. ముఖ్యమంత్రి ఆదేశాలని చెప్పేవారని ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖను విభజించి దాని శక్తిని తగ్గించొద్దని, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) ఏర్పాటుతో నష్టమని చెప్పినా ప్రవీణ్ ప్రకాశ్ పట్టించుకోలేదని ఆయన తెలిపినట్లు సమాచారం.
164 వాంగ్మూలం నమోదు..
విజయవాడ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ మంగళవారం తొలుత విజయవాడ పోలీసు కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. లిక్కర్ కేసులో సిట్ అధికారులు ఆయన్ను కొంతసేపు విచారించారు. అనంతరం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లారు. బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 183 (సీఆర్పీసీ 164) కింద ఆయన వాంగ్మూలాన్ని న్యాయాధికారి రికార్డు చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం