Share News

కూటమికి రెబల్స్‌ బెడద

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:40 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల కూటమి పార్టీలకు రెబెల్స్‌ బెడద ఎదురైంది. పొత్తులో భాగంగా ఒక పార్టీకి సీటు కేటాయించిన చోట, పోటీగా మరో పార్టీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు.

కూటమికి రెబల్స్‌ బెడద
KUTAMI

  • ఏలూరు మేయర్‌కు జనసేనకు పోటీగా టీడీపీ నామినేషన్‌

  • తుని, తిరువూరు, సాలూరు చైర్‌పర్సన్‌ సీట్లకూ ఇదే పరిస్థితి

  • పిఠాపురం, గొల్లప్రోలులో జనసేన పార్టీలోనే రెబల్స్‌

  • జగ్గయ్యపేటలో తమ్ముళ్ల మధ్య పోరు

  • పార్వతీపురంలో టీడీపీ వర్సెస్‌ బీజేపీ

  • కూటమికి రెబెల్స్‌ బెడద

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల కూటమి పార్టీలకు రెబెల్స్‌ బెడద ఎదురైంది. పొత్తులో భాగంగా ఒక పార్టీకి సీటు కేటాయించిన చోట, పోటీగా మరో పార్టీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. ఏలూరు మేయర్‌, తుని, తిరువూరు, సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీట్లను జనసేనకు కేటాయించగా, ఇక్కడ టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇక కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆ పార్టీ నుంచే రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గొల్లప్రోలులోనూ ఇదే పరిస్థితి. జగ్గయ్యపేటలో తెలుగు తమ్ముళ్ల మధ్య, పార్వతీపురంలో టీడీపీ వర్సెస్‌ బీజేపీ పోటీ ఏర్పడింది. కూటమి పొత్తులో భాగంగా ఏలూరు కార్పొరేషన్‌ మేయర్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించగా శనివారం మేయర్‌ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయడు నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ నుంచి మేయర్‌ టికెట్‌ ఆశించిన నగర టీడీపీ కార్యదర్శి రెడ్డి నాగరాజు ఆదివారం రెబెల్‌గా బరిలో దిగారు. కూటమి పార్టీలకు డివిజన్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. నగరంలో మొత్తం 62 డివిజన్లు ఉండగా, పలు డివిజన్లలో టీడీపీ, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు.


కాకినాడ జిల్లాలో తుని మున్సిపాలిటీ జనసేనకు కేటాయించగా, పోటీగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గొల్లప్రోలులో జనసేన చైౖర్‌పర్సన్‌ అభ్యర్థికి పోటీగా అదే పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. ఇక్కడ వైసీపీ ప్రకటించిన అభ్యర్థికి పోటీగా ఆ పార్టీ నుంచి రెబెల్స్‌గా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. పిఠాపురంలో జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థికి పోటీగా అదే పార్టీ నుంచి రెబల్‌ అభ్యర్థులుగా ఇద్దరు బరిలో ఉన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరు మున్సిపాలిటీ సీటును జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ నాయకురాలు పసుపులేటి మాధవి నామినేషన్‌ వేశారు. రెబల్‌ అభ్యర్థిగా టీడీపీ నుంచి పెనుబల్లి శ్రావణి రంగంలోకి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దగ్గరుండి నామినేషన్‌ వేయించారు. ఇదే జిల్లాలో జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా నరేంద్రుల వినీత పేరును ఖరారు చేయగా, ఆచంట సునీత టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు చైర్‌పర్సన్‌ సీటు జనసేనకు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి జి.విజయకుమారితో పాటు మరో అభ్యర్థి కె.వసంతి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీకి చెందిన కె.గాయత్రీదేవి, నిమ్మాది శ్యామల, నిమ్మాది కుసుమ, కె.వరలక్ష్మి తదితరు లు నామినేషన్‌ పత్రాలు అందించారు. పార్వతీపురం పురపాలక సంఘా న్ని టీడీపీకి కేటాయించగా ఆ పార్టీ నుంచి బెలగాం కరుణ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అదే స్థానం కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సతీమణి జ్యోతితో పాటు వారి కోడలు దీప్తి నామినేషన్లు వేశారు. పార్వతీపురంలో వైసీపీ అధిష్ఠానం ప్రకటించిన చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎస్‌.లక్ష్మీపార్వతితో పాటు స్థానిక నేతలు నిర్ణయించిన పట్నాల సాయిశ్రీ కూడా నామినేషన్లు వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

Updated Date - Oct 19 , 2026 | 05:40 AM