Share News

ధైర్య‘లక్ష్మి’ దీనగాథ!

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:27 AM

ప్రాణాలకు తెగించి ఉన్మాదిని ఎదిరించిన అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థిని లక్ష్మి ధైర్య సాహసాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కళ్లెదుట స్నేహితురాలిపై జరుగుతున్న ఘోరాన్ని అడ్డుకోబోయి గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ధైర్య‘లక్ష్మి’ దీనగాథ!

  • రాప్తాడు ఘటనలో ధైర్యాన్ని చూపిన లక్ష్మి

  • కటిక పేదరికంలో విద్యార్థిని కుటుంబం

  • ఆదుకోవాలంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు

  • కేంద్ర సాహస బాలిక అవార్డుకు ప్రభుత్వం సిఫారసు

అనంతపురం వైద్యం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రాణాలకు తెగించి ఉన్మాదిని ఎదిరించిన అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థిని లక్ష్మి ధైర్య సాహసాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కళ్లెదుట స్నేహితురాలిపై జరుగుతున్న ఘోరాన్ని అడ్డుకోబోయి గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమను అంగీకరించలేదన్న కారణంగా పదో తరగతి విద్యార్థినిని ఆమె సమీప బంధువు, వరుసకు అన్నయ్యే హేమంత్‌ గత నెల 31వ తేదీ రంపంతో కోసిన విషయం తెలిసిందే.

తరగతి గదిలో ఈ దారుణం జరగడంతో మిగిలిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ లక్ష్మి మాత్రం తన స్నేహితురాలిపై జరుగుతున్న దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ఉన్మాది ఆమె కాళ్లను రంపంతో తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం అనంతపురం సర్వజన వైద్యశాలలో బాలిక చికిత్స పొందుతోంది. ఉన్మాది పవర్‌ కట్టర్‌తో (ఎలక్ట్రిక్‌ రంపం) దాడికి తెగబడినా భయపడకుండా, తన స్నేహితురాలిని కాపాడానికి ఆమె చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు. ఆ బాలిక పేరును జాతీయ సాహస బాలిక అవార్డుకు (నేషనల్‌ బ్రేవరి అవార్డ్‌) రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. దేశంముందు ధైర్యశాలిగా నిలబడిన ఆ బాలిక వెనుక పేదరికంతో అల్లాడే దీనగాథ ఉంది.


దీనావస్థలో కుటుంబం

విద్యార్థిని లక్ష్మి కుటుంబం కటిక పేదరికంతో ఇబ్బంది పడుతోంది. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. పని ఉంటే తిండి లేకుంటే పస్తే అన్నట్లుగా పరిస్థితి ఉంది. లక్ష్మి తల్లి రమాదేవి ప్రైవేట్‌ కళాశాలలో స్వీపర్‌గా, తండ్రి నాగరాజు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో లక్ష్మి పెద్దకుమార్తె. రెండో కుమార్తె యామిని ఎనిమిదో తరగతి, మూడో కుమార్తె వర్షిణి ఆరో తరగతి, కుమారుడు వినోద్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. లక్ష్మి రెండో చెల్లెలు వర్షిణి పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతోంది. ప్రత్యేక శ్రద్ధ, వైద్యం అవసరమైన ఆ చిన్నారికి సరైన పోషకాహారం, వైద్యం అందించే ఆర్థిక స్థోమత ఆ తల్లిదండ్రులకు లేదు. వీరికి తోడు ఇంట్లో 70 ఏళ్ల వృద్ధురాలైన లక్ష్మి నానమ్మ అంజినమ్మ కొన్నేళ్లుగా కాళ్లు చచ్చుపడిపోయి మంచానికే పరిమితమైంది. ఈమెకు కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బంది పడుతోంది.

కూలిపోయే స్థితిలో ఇల్లు..

లక్ష్మి కుటుంబం నివస్తున్న ఇల్లే వారి పేదరికానికి సజీవ సాక్ష్యం. రాప్తాడు పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన గతంలో ప్రభుత్వం లక్ష్మి అవ్వాతాతకు మంజూరు చేసిన ఇల్లు అది. తర్వాత మరో ప్రభుత్వం కూడా ఇల్లు మంజూరు చేసింది. కానీ కాలం గడిచేకొద్దీ రెండిళ్లూ శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు పెచ్చులూడిపోతు, గోడలు నెర్రలు చీలి ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. ఏడుగురు నివస్తున్న ఇంట్లో కనీసం మరుగుదొడ్డి లేదు. స్నానాలు చేసేందుకూ ఇబ్బందులే. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లాల్సిన దుర్భర పరిస్థితులను అ కుటుంబం ఎదుర్కొంటోంది.


సాయం అందించాలి

చిన్న వయసులో అసాధారణ సాహసాన్ని తరగతి గదిలో చూపిన లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాప్తాడు ప్రజలు చెబుతున్నారు. లక్ష్మికి ఇచ్చే అవార్డులు, ప్రశంసలు కేవలం కాగితాలకో, వేదికలకో పరిమితం కాకుండా ఆమె కుటుంబానికి శాశ్వత ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని ప్రజా సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.

లక్ష్మితోపాటు ఆమె ముగ్గురు తోబుట్టువుల పూర్తి బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించి, ఉన్నత చదువుల వరకు ఉచిత విద్య, వసతి అందించాలని విన్నవిస్తున్నారు. వైకల్యంతో బాధపడుతున్న లక్ష్మి సోదరికి ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు. లక్ష్మి కుటుంబానికి పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వాలని, ఆమె నాన్నమ్మ వైద్య ఖర్చుల కోసం, కుటుంబ తక్షణ అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నగదు సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపదలో ఉన్న స్నేహితురాలి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన లక్ష్మి సమాజానికి ఆదర్శమని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది.

జీవనాధారం చూపాలి

నా రెండో కుమారుడైన నాగరాజు, కోడలు రమాదేవికి నలుగురు పిల్లలున్నారు. పాత ఇల్లు మినహా మాకు ఎక్కడా సెంటు స్థలం, పొలంలేదు. నా కొడుకు, కోడలు కూలికి పోతేనే ఇల్లు గడిచేది. లేకపోతే పిల్లలు ఆకలితో ఉంటున్నారు. బడిలోపెట్టే అన్నం తినివస్తున్నారు. నాకు రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. మనవరాలు వర్షిణికి మాటలు రావు. డాక్టర్‌తో చూపించుకోవాలన్నా డబ్బుల్లేవు. నా కొడుకు, కోడలికి జీవనాధారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే జీవితంలో వాళ్లే బాగుపడతారు.

- అంజినమ్మ, లక్ష్మి నానమ్మ

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 04:34 AM