Share News

మృత్యువుతో పోరాడి మెడికో మృతి

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:04 AM

ఎన్నో ఆశలతో కష్టపడి చదివి స్పెషలిస్ట్‌ వైద్యులు కావాలనుకున్న మెడికోలపై.. మత్తు తలకెక్కిన ఇద్దరు సైకోలు కారుతో డీకొట్టిన ఘటనలో డాక్టర్‌ ప్రియాంక తుదిశ్వాస విడిచారు.

మృత్యువుతో పోరాడి మెడికో మృతి
Rajahmundry Medico Priyanka

  • రాజమండ్రిలో ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో విషాదం

  • హైదరాబాద్‌ ఆస్పత్రిలో ప్రియాంక తుదిశ్వాస

  • నిందితులను ఉరితీయాలని డిమాండ్‌

  • కోర్టుకు నిందితులు.. 22 వరకు రిమాండ్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఆశలతో కష్టపడి చదివి స్పెషలిస్ట్‌ వైద్యులు కావాలనుకున్న మెడికోలపై.. మత్తు తలకెక్కిన ఇద్దరు సైకోలు కారుతో డీకొట్టిన ఘటనలో డాక్టర్‌ ప్రియాంక తుదిశ్వాస విడిచారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ దారుణ ఘటనలో మృత్యువుతో ఐదురోజుల పోరాడిన పీజీ మెడికల్‌ విద్యార్థి ప్రియాంక.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆ మత్తోన్మాదుల ఉన్మాదం ఆలస్యంగా వెలుగులోకివచ్చి.. మీడియాలో, సోషల్‌ మీడియాలో కథనాలు, వీడియోలు బయటకు రావడంతో ప్రజలు ఆవేశం కట్టలు తెంచుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల పాటు దారుణం బయటకు రాకుండా తొక్కిపట్టారంటూ స్థానికులు మండిపడుతున్నారు.


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంరాజానగరంలో ఉన్న జీఎస్ఎల్‌ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చదువుతున్న విద్యార్థి ప్రియాంకను కావాలని పదేపదే కారుతో గుద్దించి, తలపైకి కారు పోనిచ్చిన విషయం తెలిసిందే. బీటెక్‌ చదివిన నిందితులు ఇద్దరూ దిశ్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ స్నేహితులు. దిశ్వంత్‌ తండ్రికి మూసల(బంగారం కరిగించే పాత్రలు) కంపెనీతో పాటు భూములున్నాయి. ఆండ్రూ జోసెఫ్‌ తండ్రి పాస్టర్‌ కాగా, తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. ఇద్దరూ ధనవంతులు కావడంతో కేసు విషయంలో ‘ప్యాకేజీ’లు కుదుర్చుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరినీ శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా 22 వరకు రిమాండు విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు.


రాజమహేంద్రవరంలో విద్యార్థుల ర్యాలీలు

మెడికోను దారుణంగా కారుతో తొక్కించిన ఘటన చూసి ప్రజలు చలించిపోయారు. వారిని కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏం చేసినా డబ్బు వెదజల్లి చట్టం నుంచి తప్పించుకోవచ్చనే అహంకారంతో వారు ప్రవర్తించారని, అలాంటి ఉన్మాదులను బహిరంగంగా శిక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . ఇక రాజమహేంద్రవరంలో మెడికల్‌ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రియాంకకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుల దుర్మార్గంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ పోస్టులు పెడుతున్నారు.


సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి

డాక్టర్‌ ప్రియాంక ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రియాంక మరణంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహచర విద్యార్థి ఉమేష్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారని అధికారులు సీఎంకు వివరించారు. వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధితులకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ఐఐటీ తిరుపతిలో 25 కోట్ల పెట్టుబడి.. కియా ఇండియా చీఫ్‌ ఏవో టిహ్యూన్‌ కిమ్‌ ప్రకటన

Updated Date - Aug 08 , 2026 | 07:05 AM