‘స్థానికం’లో సమరం
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:47 AM
అధికారం కోల్పోయినా వైసీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్లనే నామినేషన్లు వేయనివ్వకుండా భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు, రాయచోటిలో.. .
నామినేషన్ల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తతలు
అధికారంలో లేకున్నా వైసీపీ అదే అరాచకం
పుంగనూరు, రాయచోటిల్లో గూండాగిరి
పుంగనూరు నామినేషన్ కేంద్రంలో టీడీపీ శ్రేణులపై ఎంపీ మిథున్‌రెడ్డి దౌర్జన్యం
8 వాహనాల్లో రాళ్లు, రాడ్లు, కర్రలు, మద్యం బాటిళ్లతో రాక
ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలను కారుతో ఢీకొట్టిన వైనం
నామినేషన్ కేంద్రం గేటును ఢీకొట్టి మరీ లోపలికి కాన్వాయ్
ఆగ్రహంతో తిరగబడిన టీడీపీ మద్దతుదారులు
మిథున్‌రెడ్డి కాన్వాయ్‌లోని 6 వాహనాలు ధ్వంసం
వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు.. గాల్లోకి డీఎస్పీ కాల్పులు
ఇరువర్గాలపై లాఠీచార్జి చేసి చెదరగొట్టిన ఎస్పీ
వైసీపీ అభ్యర్థి నామినేషన్ తీసుకోని రిటర్నింగ్ అధికారి
చెప్పింది వినకుంటే చంపేస్తామని ఎంపీ హెచ్చరిక
రాయచోటిలో టీడీపీ వర్గీయులను రెచ్చగొట్టిన గడికోట
వైసీపీ వాహనాలకు టీడీపీ శ్రేణుల నిప్పు
ధర్మవరంలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, బీజేపీ కార్యకర్తలు
అధికారం కోల్పోయినా వైసీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్లనే నామినేషన్లు వేయనివ్వకుండా భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు, రాయచోటిలో.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. పుంగనూరులో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆయన అనుచరులు చెలరేగిపోయారు. గొడవలకు దిగాలనే ముందస్తు వ్యూహంతో నామినేషన్ కేంద్రానికి మారణాయుధాలతో వచ్చారు. కారుతో టీడీపీ శ్రేణులను ఢీకొట్టి పలువురిని గాయపరిచారు.
దీంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడి ఆయన కార్లను ధ్వంసం చేశారు. రాయచోటిలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడంతో వారు ప్రతిఘటించారు. అటు ధర్మవరంలోనూ వైసీపీ నేతలు బీజేపీ శ్రేణులను కవ్వించడంతో రాళ్ల దాడులు జరిగాయి.
అన్నమయ్య, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే ప్రతిపక్ష వైసీపీ దౌర్జన్యకాండకు తెరలేపింది. అన్నమయ్య జిల్లాలో పాలక టీడీపీ నాయకులపై దాడికి యత్నించింది. గత ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా టీడీపీ మద్దతుదారులను అడ్డుకుని.. దాడులు చేసి నామినేషన్ పత్రాలను గుంజుకుని చింపేసిన తరహాలోనే.. శుక్రవారం పుంగనూరు నామినేషన్ కేంద్రంలో కూడా టీడీపీ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. గొడవలకు దిగాలనే ముందస్తు వ్యూహంతో పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని నామినేషన్ కేంద్రానికి మిథున్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు 8 వాహనాల కాన్వాయ్‌తో వచ్చారు.
పుంగమ్మ చెరువు కట్ట వద్ద రోడ్డుపై కూటమి శ్రేణులుండగా.. కాన్వాయ్‌లోని వాహనం ఉద్దేశపూర్వకంగానే వారిని ఢీకొట్టడంతో టీడీపీ నేతలు గంగాధర్‌రెడ్డి, ముళ్లంగి వెంకటరమణ గాయపడ్డారు. కూటమి శ్రేణులు ఆగ్రహంతో ఎంపీ కాన్వాయ్‌ని వెంబడించి రాళ్లు రువ్వారు. అతివేగంగా కాన్వాయ్ వెళ్లడంతో వారు ఆ వెనుకే బయల్దేరారు. కాన్వాయ్‌లోని వాహనాలు వేగంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రం గేటును ఢీకొని లోపలకు వెళ్లాయి. అడ్డుపడిన టీడీపీ నేత సయ్యద్ సుహేల్ బాషాను కారుతో ఢీకొట్టడంతో గాయపడ్డారు. ఒక వాహనం నామినేషన్ కేంద్రం ముందే వేగంగా నాలుగు రౌండ్లు తిరగడం, నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపైకి దూసుకెళ్లడంతో అక్కడివారు భయబ్రాంతులకు గురయ్యారు. కాన్వాయ్‌లోని 8 కార్లలో రాళ్లు, రాడ్లు, కర్రలు, మద్యం బాటిళ్లు వేసుకుని వచ్చారు. నామినేషన్ కేంద్రం వద్ద మిథున్‌రెడ్డి కారు దిగగానే.. కూటమి కార్యకర్తలు ఆయన్ను నిలదీశారు.
అదే సమయంలో కాన్వాయ్‌లోని ఆయన అనుచరులు రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులకు దిగారు. టీడీపీకి చెందిన 15 మంది గాయపడ్డారు. దీంతో కూటమి శ్రేణులు ఎదురుదాడికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు మిథున్‌రెడ్డిని నామినేషన్ కేంద్రంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. టీడీపీ కార్యకర్తలు ఆ గది వైపు దూసుకెళ్లారు. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ మద్దతుదారులు ఎంపీ కాన్వాయ్‌లోని ఆరు వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈలోపు జిల్లా ఎస్పీ ధీరజ్ అక్కడకు చేరుకున్నారు.
లాఠీచార్జితో రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎస్పీతో పాటు పోలీసులు అన్యాయంగా తమపై లాఠీచార్జి చేశారని కూటమి శ్రేణులు నామినేషన్ కేంద్రం ఆవరణలో ధర్నాకు దిగాయి.. కాగా.. మిథున్‌రెడ్డి నామినేషన్ కేంద్రంలో ఉన్నంత వరకు అధికారులు టీడీపీ నేతలను నామినేషన్ దాఖలుకు అనుమతించలేదు. ఎంపీని 3 గంటలు తమ రక్షణలో ప్రత్యేక గదిలో ఉంచి.. ఆ తర్వాత పోలీసు వాహనంలో మదనపల్లెకు సురక్షితంగా తీసుకెళ్లారు. ఎంపీ అనుచరుల దాడిలో గాయపడిన టీడీపీ వర్గీయులను పుంగనూరు టీడీపీ ఇన్చార్జి మధుసూదన్నాయడు, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యేలు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు పరామర్శించారు. వారిని ఆస్పత్రులకు తరలించారు. అటు ఎంపీ కాన్వాయ్‌లో గాయపడినవారిని అంబులెన్స్‌లో మదనపల్లెకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు గొడవలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంది. అనంతరం చైర్మన్ స్థానానికి ఒకటి, కౌన్సిలర్ స్థానాలకు 19.. మొత్తం 20 నామినేషన్లు టీడీపీ తరపున దాఖలయ్యాయి.
రిటర్నింగ్ అధికారికి ఎంపీ బెదిరింపు!
పుంగనూరు మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిని మహ్మద్ సహతాజ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నారాయణరెడ్డి తీసుకోవడానికి నిరాకరించారు. ఎంపీ మిథున్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో వెళ్లి వైసీపీ అభ్యర్థి నామినేషన్ తీసుకోవాలని ఆర్వోను కోరారు. పెద్దసంఖ్యలో రావడం తగదని నారాయణరెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నారాయణరెడ్డిపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పింది వినకుంటే చంపేస్తానని బెదిరించారు.
వైసీపీ అణచివేతవల్లే ప్రజల తిరుగుబాటు: మండిపల్లి
రాయచోటి, పుంగనూరు నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ పాలనలో అణచివేతకు గురయ్యారని, అందుకే ఇప్పుడు తిరుగుబాటు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి ప్రాంతంలో గత స్థానిక ఎన్నికల్లో ఒక్క నామినేషన్ కూడా వేయకుండా అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇప్పుడు కూడా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని ధ్వజమెత్తారు.
హింసకు పాల్పడినవారిపై చర్యలు: డీఐజీ
పుంగనూరు, రాయచోటిలో హింసాత్మక సంఘటనలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ కోయ తెలిపారు. 2022 ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు వేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని, ఇప్పుడు ప్రతిఘటించడంతో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.
రాయచోటిలో టీడీపీ,వైసీపీ పరస్పర దాడులు
రాయచోటి మున్సిపాలిటీలోనూ తొలిరోజు నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఆయన చేతగానితనంవల్లే జిల్లా కేంద్రం మదనపల్లెకు తరలిపోయిందని.. వైసీపీ నేతలను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఎన్కాలనీలోని వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు దిగాయి. 5 వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాయచోటి ట్రాఫిక్ సీఐ వాహనం కూడా ధ్వంసమైంది. వైసీపీ కార్యాలయానికీ నిప్పంటించారు.
ధర్మవరంలో ఉద్రిక్తత
ధర్మవరం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత తలెత్తింది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, బీఎస్ఆర్ మున్సిపాలిటీ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు శుక్రవారం నామినేషన్లను స్వీకరించారు. మొదటి రోజు అన్ని వార్డుల్లో నామినేషన్లను సమర్పించడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు వెంకటక్రిష్ణారెడ్డి, ఆ పార్టీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి తదితరులు భారీ అనుచరగణంలో వచ్చారు. ధర్మవరం రూరల్, బత్తలపల్లి మండలం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలను రప్పించారు. అభ్యర్థులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న కూటమి నేతలను కవ్వించారు. దీంతో బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. కొందరు గాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు