Share News

దిగ్గజ నిర్మాత ఆర్‌బీ చౌదరి మరణం.. సంతాపం తెలిపిన పవన్, లోకేశ్

ABN , Publish Date - May 05 , 2026 | 09:39 PM

దిగ్గజ నిర్మాత ఆర్‌బీ చౌదరి మరణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారన్న వార్తను నమ్మలేకపోతున్నానని అన్నారు.

దిగ్గజ నిర్మాత ఆర్‌బీ చౌదరి మరణం.. సంతాపం తెలిపిన పవన్, లోకేశ్
RB Choudary

అమరావతి, మే 5: దిగ్గజ నిర్మాత ఆర్‌బీ చౌదరి మరణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారన్న వార్తను నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ తరఫున డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ మంగళవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌బీ చౌదరి అకాల మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారన్న వార్తను నేను నమ్మలేకపోతున్నాను’..


‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రానికి ఆయనే నిర్మాత. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంచుకుని, అద్భుతమైన పాటలతో సినిమాలను నిర్మించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ‘అన్నవరం’ సినిమాలో ఆయన చూపించిన చెల్లెలి సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో నిర్మాతగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆర్‌బీ చౌదరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ఉంది.


ఆర్‌బీ చౌదరి మరణం బాధాకరం..

ఆర్‌బీ చౌదరి అకాల మరణంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రముఖ నిర్మాత ఆర్‌‌బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెంద‌డం చాలా బాధాక‌రం. వారి దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసి ప్రేక్షకులను అల‌రించిన ఆర్‌బీ చౌదరి మృతి చిత్రపరిశ్రమకు తీర‌ని లోటు. వారి ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను’అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 05 , 2026 | 09:44 PM